హోం మంత్రి అలా అనడం సిగ్గుచేటు : ఏబీవీపీ

2 Dec, 2019 16:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనకు నిరసనగా ‘జస్టిస్‌ దిశ’ పేరుతో ఏబీవీపీ హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఎస్వీకే నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆలస్యం చేయకుండా నిందితులకు కఠిన శిక్షలు విధించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. దిశకు న్యాయం జరిగేవరకూ తమ ఉద్యమం ఆగదన్నారు. దిశ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి స్పందించిన తీరు దారుణంగా ఉందన్నారు. దిశ ఇంటికి ఫోన్‌ చేయాల్సింది కాదు, పోలీసులకు ముందు ఫోన్‌ చేయల్సిందని హోం మంత్రి అనడం సిగ్గు చేటన్నారు. ఫిర్యాదు ఇవ్వబోతే తమ పరిధిలోకి రాదని చెప్పడాన్ని బట్టే పోలీసులు ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతుందని విమర్శించారు. ‘చంద్రశేఖర్‌ ఆజాద్‌ లాంటి పేరు పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ .. ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారని, వెంటనే ఆయన పేరు మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమం మహిళల చేతిలోకి వెళ్లిందని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు