దిశ కేసు: హైదరాబాద్‌ మెట్రో సంచలన నిర్ణయం

4 Dec, 2019 20:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: షాద్‌నగర్‌లో జరిగిన దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో మహిళల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలులో ప్రయాణం సందర్భంగా మహిళలు తమ వెంట పెప్పర్‌ స్పే తీసుకెళ్లేందుకు అనుమతించింది. ఇప్పటికే బెంగళూరు మెట్రో మహిళలు ప్రెప్పెర్‌ స్ప్రేలతో ప్రయాణించేందుకు అనుమతించగా.. హైదరాబాద్‌ మెట్రో కూడా అదే దారిలో సాగుతూ నిర్ణయం తీసుకుంది.

షాద్‌నగర్‌ సమీపంలో అత్యంత అమానుషంగా జరిగిన దిశ సామూహిక అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళల రక్షణ కోసం ఇకనుంచి పెప్పర్ స్ప్రేలను కూడా మెట్రో స్టేషన్‌లోకి అనుమతిస్తామని బెంగళూరు మెట్రో ప్రకటించగా. తాజాగా హైదరాబాద్‌ మెట్రో కూడా అదే నిర్ణయం తీసుకుంది. మహిళలపై లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో వర్గాలు భావిస్తున్నాయి.

మెట్రోరైలులో సాంకేతిక కారణాలతో సాధారణంగా పెప్పర్ స్ప్రే, నిప్పు వ్యాప్తి చేసే పదార్థాలను అనుమతించరు.  పెప్పర్ స్ప్రేల వల్ల త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. ఎవరైనా వీటిని తీసుకొస్తే చెకింగ్‌ పాయింట్ల వద్దే వాటిని పడేయాల్సి వచ్చేది. దీన్ని ప్రమాదంగా భావించిన మెట్రో అధికారులు అలాంటివి మహిళల వద్ద అవి దొరికితే సీజ్ చేసేవారు. కానీ ఇకనుంచి మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేశారు. మెట్రోలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు