దిశ కేసు: సమాధానం చెప్పలేని ప్రశ్నలెన్నో?

5 Dec, 2019 14:01 IST|Sakshi

#Justice_for_Disha..మనమింతే ఆవేశమున్నంతసేపే ఆలోచిస్తాం.. ఆవేశంలాగే చప్పున చల్లారిపోతాం!!
భ్రమలు తొలగిపోయాయి. హైదరాబాద్‌ విశ్వనగరమని, దేశంలోనే అత్యంత సురక్షిత నగరమని పొద్దునలేస్తే రాజకీయ నాయకులు మొదలు పోలీసు బాసుల వరకు చెప్పిందే చెప్పారు. కానీ నగర శివార్లలో తాము నిరంతరం గస్తీ తిరిగే ప్రదేశంలో అత్యంత కిరాతకమైన ఘటన జరుగుతుంటే పోలీసులు గ్రహించలేకపోయారు. బాధితుల తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే తమ పరిధి కాదంటూ చేతులేత్తేశారు. కాపాడాల్సిన పోలీసులే మాకేం పట్టి మా పరిధి కాదంటూ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ఇంకా ఈ సమాజానికి ఎవరు భద్రత?

జస్టిస్‌ ఫర్‌ దిశ (షాద్‌నగర్‌ శివార్లలో జరిగిన అమానుష హత్యాచార బాధితురాలి మారుపేరు) కేసులో తప్పెవరిది. ఎవరిని ప్రశ్నిద్దాం. మహిళ ఒంటరిగా నిర్భయంగా బయటకు వెళ్లి వచ్చే పరిస్థితి ఇప్పటికీ లేదు. పేరుకు గొప్ప నగరమే. కానీ, నగరంలో, నగర శివార్లలో ఎన్నో గ్రే ఏరియాలు ఉన్నాయి. ప్రమాదకరమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటి మీద పోలీసులకు ఏమైనా అవగాహన ఉందా? ఇలాంటి గ్రే ఏరియాల్లో నేరాలు జరగకుండా పోలీసులు ఏవైనా ప్రివెంటివ్‌ మెష్యూర్స్‌ తీసుకుంటున్నారా? పోలీసులు, ప్రభుత్వం, వ్యవస్థే కదా నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సింది.

ఆపద సమయాల్లో ఒంటరి మహిళలకు ఆదుకునేందుకు ఎన్నో చర్యలు చేపట్టినట్టు పోలీసులు చెప్తున్నారు. డయల్‌ 100తోపాటు అత్యవసర పరిస్థితుల్లో సత్వరమే సహాయం అందించేందుకు 112 టోల్‌ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్తున్నారు. 112కు డయల్‌ చేయలేని పరిస్థితి ఉంటే.. తమ స్మార్ట్‌ ఫోన్‌లో ‘పవర్‌ బటన్‌’ను మూడుసార్లు వెంటవెంటనే నొక్కినా కూడా హెల్ప్‌లైన్‌కు సమాచారం అందుతుందని, సాధారణ ఫోన్లలో ‘5’ లేదా ‘9’ అంకెను లాంగ్‌ ప్రెస్‌ చేసినా ఈ సేవలు పొందే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఈ సేవలను ఆపద వేళల్లో మహిళలు, యువతులు నిర్భయంగా ఉపయోగించుకునేవిధంగా ఎందుకు విస్తృతంగా అవగాహన కలిగించలేకపోయారు? పోలీస్‌ స్టేషన్లకు వెళితే కంప్లయింట్లే తీసుకోవడం లేదు? ఇక ఫోన్‌ చేస్తే సమయానికి ఆదుకుంటారనే భరోసా ఎలా ఇస్తారనే అనుమానం ప్రజల్లో రాకపోదా? ఇవన్ని పోలీసులు సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు. ఇకనైన, నగరం, నగర శివారు ప్రాంతాలు మహిళలకు మరింత సురక్షితంగా మార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది పోలీసుల ముందున్న సవాల్‌.

దిశపై ఊహకందని అమానుషం జరిగింది. ఆ దారుణం నిజంగానే సమాజం అంతరాత్మను కదిలించింది. కానీ, ఈ ఘటనలో పోలీసులూ, వ్యవస్థ తప్పును ఎత్తిచూపుతున్నప్పుడు ప్రజలుగా మన బాధ్యతను, తప్పును గుర్తించాలి. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ఇప్పటికీ భాగ్యనగరంలో ఒంటరి మహిళలకు ఏదోరూపంలో ముప్పు వెంటాడుతూనే ఉంది. కాబట్టి, ఒంటరిగా ప్రయాణం చేసేవాళ్లు ధైర్యంగా ఉండటం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇక్కడ దిశను తప్పుబట్టడమో అలా చేయాల్సి ఉండాలి ఇలా చేయాల్సి ఉండాలని చెప్పడం కాదు. ఒకానొక్క క్లిష్టస్థితిలో తను ఉన్నప్పుడు మాటువేసి పక్కా ప్లానింగ్‌తో మృగాళ్లు ఈ దాడికి పాల్పడినట్టు స్పష్టమవుతూనే ఉంది. ఆ భయానక రాత్రి ఒంటరై.. దిక్కుతోచని స్థితిలో ధైర్యం కోసం చెల్లెలికి ఫోన్‌ చేసిన దిశ.. అంతకుమించి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లింది. మనుషులంతా మంచివాళ్లేననుకొని.. మానవ మృగాళ్లు ముసుగులో తిరుగుతుంటారని గ్రహించి ఉండకపోవచ్చు. మృగాల అమానుషత్వానికి బలై బూడిదగా మిగిలిన దిశ సమాజానికి ఎన్నో ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. ఈ ప్రశ్నల పరంపర ఎక్కడ ఆగుతుంది? ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్నలెన్నో ఈ ఘటనలో..

ఈ ఘటన తర్వాత మనమేమైనా చెప్పుకోవాల్సింది ప్రశ్నించుకోవాల్సింది ఉందా? నిజాయితీగా చెప్పండి. పోలీసుల సహాయం తీసుకోవడానికి మనలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు. ఆపద సమయాల్లో 100కు లేదా 112కు నిర్భయంగా డయల్‌ చేయండని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఒంటరిగా ప్రయాణించే మన బిడ్డలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నాం? మొబైల్‌ ఫోన్‌ ఇస్తున్నాం.. ఏదైనా కష్టమొస్తే మనకో మన బంధువులకో ఫోన్‌ చేయమంటున్నాం కరెక్టే. కానీ, ఇంకా ముందుకెళ్లి వ్యవస్థ సహాయం తీసుకోగలిగేలా ధైర్యం ఇవ్వగలుగుతున్నామా? ఒంటరి వేళలో నిర్భయంగా ఉండేగలిగే ధైర్యాన్ని, వ్యవస్థ నుంచి నిస్సంకోచంగా సహాయం కోరే పరిణతిని మనం కల్పిస్తున్నామా? ఆడపిల్లల్ని ఎన్ని కట్టుబాట్లలో పెంచుతున్నాం. నీకు ఏదైనా ఆపద వస్తే పోలీసులకు ఫోన్‌ చేసి సహాయం తీసుకోమని చెప్పగలుగుతున్నామా?

మొబైల్‌ ఫోన్‌ కమ్యూనికేషన్‌ సాధనమే కాదు.. సరిగ్గా వాడుకుంటే బలమైన ఆయుధం కూడా. మొబైల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ ఉంటే ప్రపంచమే అరచేతుల్లో ఉంటుంది. ఎవరైనా క్షణాల్లో ఆన్‌లైన్‌లోకి రావొచ్చు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టొచ్చు. చుట్టుపక్కల ఎవరైనా స్నేహితులున్నా వారి సహాయం తీసుకోవచ్చు. తన లోకేషన్‌ షేర్‌ చేసి..యావత్‌ ప్రపంచానికి తానున్న పరిస్థితిని వివరించవచ్చు. చెప్పలేం ఏదైనా సహాయం దొరకపోదా? కానీ, ఆపదలో ఉన్నానని చెప్పి.. సమయానుకూలంగా సహాయం తీసుకోగలిగే ధైర్యాన్నైనా మనం ఇవ్వగలుతున్నామా? ఒకవేళ ఆపద సంభవిస్తే మన ఫోన్‌ని ఎలా వాడాలన్నది ఎవరైనా గ్రౌండ్‌లెవల్‌లో అవగాహన కల్పిస్తున్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. మన బిడ్డల్ని సుశిక్షితులను చేసుకోవడం లేదు. ధైర్యంగా పెంచడం లేదు. కట్టుబాట్ల పేరిట అమాయకంగా పెంచుతున్నాం. ఆ అమాయకులను ఇలాంటి మానవ మృగాలు ఇప్పటికీ కబళిస్తూనే ఉన్నాయి. దీనిని ఎదుర్కొనేందుకు మనవంతు బాధ్యతగా చేయాల్సింది చాలా ఉంది. ఆవేశమే కాదు ఆలోచనతో వివేచనతో ఈ దారుణ ఘటనపై చర్చించాల్సిన అవసరముంది.

-శ్రీకాంత్‌ కాంటేకర్

>
మరిన్ని వార్తలు