-

ఓఆర్‌ఆర్‌ అండర్‌పాస్‌ల్లో వెలుగుల ‘దిశ’

2 Mar, 2020 09:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డు తొండుపల్లి టోల్‌గేట్‌ ప్లాజా సర్వీసు రోడ్డు వద్ద ‘దిశ’పై గతేడాది నవంబర్‌ 27న అత్యాచారం, ఆపై చటాన్‌పల్లి అండర్‌పాస్‌ వద్ద మృతదేహం కాల్చివేత ఘటనతో ఉలిక్కిపడిన హెచ్‌ఎండీఏ ఓఆర్‌ఆర్‌ విభాగాధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఆ ఘటనలు జరిగిన సమయాల్లో ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ దీపాలు ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదన్న వాదన రావడంతో హెచ్‌ఎండీఏ అనుబంధ విభాగమైన హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) ఓఆర్‌ఆర్‌ విభాగాధికారులు మేల్కొన్నారు.

అప్పటి హెచ్‌జీసీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హరిచందన దాసరి ఆదేశాలతో డిసెంబర్‌లో ఓఆర్‌ఆర్‌ అండర్‌పాస్‌లలో ఎల్‌ఈడీ, సౌర లైట్లు అమర్చేందుకు టెండర్లు పిలిచారు. 158 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఓఆర్‌ఆర్‌కు ఉన్న 165 అండర్‌పాస్‌ వేలలో రూ.1.90 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయిలో విద్యుద్దీకరణ పనులు చేపట్టారు. బుధవారం నుంచి అన్నిచోట్లా ఈ వెలుగులు విరజిమ్ముతాయని అధికారులు చెబుతున్నా, కొన్నిచోట్లా మాత్రం ఇంకా పనులు పూర్తికాలేదని కిందిస్థాయి సిబ్బంది అంటున్నారు. ఏదేమైనా దిశ ఘటనతో అధికారులు మేల్కొని రాత్రివేళల్లో వెలుగులు ఉండేలా చూడటం శుభ పరిణామమని వాహ నదారులు అంటున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని, మహిళల భద్రతకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు.  

మరిన్ని వార్తలు