‘దిశ’ కేసు; చల్లారని ఆగ్రహ జ్వాలలు

5 Dec, 2019 14:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దిశ కేసులో నిందితులను వెంటనే ఉరి తీయకపోతే జైలు గోడలు కూలగొట్టి వారిని చంపేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. బుధవారం రాత్రి చర్లపల్లి జయశంకర్‌ విగ్రహం నుంచి చర్లపల్లి జైల్‌ వరకు ‘దిశ’ ఘటనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జైలు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా విద్యార్థి సంఘం నాయకుడు ప్రేంకుమార్‌ మాట్లాడుతూ అత్యాచార ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా నిందితులపై విచారణ చేపట్టకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని ‘దిశ’ చట్టాన్ని చేసి నిందితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. గల్ఫ్‌ దేశాల తరహాలో చట్టాలను కఠినతరం చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు ఒక్కసారిగా జైలు వద్దకు దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు.  

చర్లపల్లి  జైలులో ఐజీ తనిఖీలు
చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని బుధవారం జైళ్లశాఖ ఐజీ సైదయ్య సందర్శించారు. ఈ సందర్బంగా ‘దిశ’ కేసు నిందితులు ఉన్న మహనంది బ్యారక్‌ వద్ద  భద్రతను పరిశీలించారు. వారి కదలికలపై నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. అవసరమైతే  భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. ఆయన వెంట జైల్‌ పర్యవేక్షణాధికారి సంపత్, అధికారులు కృష్ణమూర్తి, వెంకటేశం ఉన్నారు.  

కస్టడీపై గోప్యత...
‘దిశ’ కేసు నిందితుల కస్టడీని కోరుతూ పోలీసులు కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసినప్పటి నుంచి పోలీసులు, జైల్‌ అధికారులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజులుగా చర్లపల్లి జైల్‌లో ఉన్న నిందితులను ఏ సమయంలోనైనా కస్టడీకి తరలించవచ్చుననే ఉద్దేశంతో  జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే మీడియా వాహనాల హడావుడి కనిపించింది. అయితే నిందితుల తరలింపుపై పోలీసులు, జైల్‌ అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. బుధవారం నిందితులను వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతించినప్పటికీ వారి తరలింపుపై స్పష్టత లేదు. శాంతిభద్రతల నేపథ్యంలో రాత్రి వేళల్లోనే వారిని కస్టడికీ తీసుకెళ్లే అవకాశం ఉండవచ్చునని సమాచారం. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు