రైళ్ల రాకపోకలకు అంతరాయం

9 May, 2014 02:50 IST|Sakshi
రైళ్ల రాకపోకలకు అంతరాయం

 మట్టెవాడ /కాజీపేటరూరల్, న్యూస్‌లైన్ : వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కింద స్లాబ్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో గురువారం పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి. అండర్ బ్రిడ్జి  కింది భాగంలో స్లాబ్ లేకపోవడంతో అప్‌అండ్‌డౌన్ మార్గాల నుంచి  రైళ్లు వెళుతున్న సమయంలో ప్రయాణికులు వదిలేస్తున్న వ్యర్థాలు కింది నుంచి వెళ్లే వాహనదారులపై పడుతున్నాయి. దీంతో రైలు వచ్చినప్పుడు అటు, ఇటు వాహనాలను నిలిపివేయడం.. ఆ తర్వాత ఒక్కసారిగా కదలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో రైల్వే అధికారులు గత  మూడు రోజులుగా అండర్ బ్రిడ్జి కింద స్లాబ్‌ను నిర్మిస్తున్నారు. వరంగల్ ఆర్‌యూబీ బ్రిడ్జి స్టీల్ గట్టర్స్ కాలం చెల్లిపోవడంతో వాటిని తొలగించి వాటి స్థానంలో భారీ క్రేన్లు, పొక్లెయిన్ల సాయంతో రైల్వే అధికారులు, సిబ్బంది పిల్లర్స్ వేస్తున్నారు.
 
అలాగే స్లాబ్‌పై సిమెంట్ బిళ్లలు పోయిస్తున్నారు. అయితే పనులను దృష్టిలో ఉంచుకుని గురువారం, శుక్రవారాల్లో అధికారులు ఇంజినీరింగ్ బ్లాక్ ఇచ్చారు. దీంతో గురువారం మధ్యాహ్నం 1.30 నుంచి సాయం త్రం 5 గంటల వరకు  అప్‌అండ్‌డౌన్ మార్గాల గుండా వచ్చే రైళ్లను నిలిపివేశారు. దీంతో వరంగల్, కాజీపేట మీదుగా కొత్త్తఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్ వె ళ్లే పలు రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేటలో గంటకు పైగా నిలిపివేశారు.

అలాగే మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్లే పుష్‌పుల్ ప్యాసింజర్‌ను కాజీపేట వరకే నడిపించి వరంగల్-కాజీపేట మధ్య రద్దు చేశారు. కాగా, బ్రిడ్జి పనుల కారణంగా శుక్రవారం కూడా కాజీపేట-వరంగల్ మధ్య పుష్‌పుల్ రైలు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, రైళ్ల నిలిపివేతతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  కాగా, వరంగల్‌లో జరుగుతున్న అండర్ బ్రిడ్జి  పనులను రైల్వే ఏడీఆర్‌ఎం రమణారెడ్డి పరిశీలించారు.
 
 ఆయన వెంట అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ విజయ్‌కుమార్, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సీఐలు ఎస్.రవికుమార్, ఎల్‌ఎస్.హరిబాబు, ధారాసింగ్ ఉన్నారు. ఇదిలా ఉం డగా అండర్‌బ్రిడ్జి స్లాబ్ పనులు చేస్తుండడంతో అటు పోస్టాఫీస్ వైపు ఇటు ఖమ్మం రహదారి వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. బ్రిడ్జి పక్కనే ఉన్న దారి గుండా రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి అక్కడి నుంచి ప్రయాణికులు వెళ్లడంతో రద్దీ ఏర్పడింది. మరో రెండు మూడు రోజులపాటు స్లాబ్ పనులు నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు