చేపా చేపా 'ఎక్కడికెళ్లావ్‌?'

15 Sep, 2018 02:16 IST|Sakshi

మందకొడిగా ఉచిత చేప పిల్లల పంపిణీ 

ఈ ఏడాది 74.73 కోట్ల లక్ష్యం 

ఇప్పటివరకు 11.40 కోట్లే పంపిణీ 

భద్రాద్రి, కొమురం భీం జిల్లాల్లో అంతంతే!

చెరువుకు చేరని చేప పిల్ల! 

21,569 నీటి వనరుల్లో చేప పిల్లలను వదలాలి..

ఇప్పటి వరకు వదిలింది.. 3,147

రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఈ ఏడాది 74.73 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా 15 శాతానికి మించి పంపిణీ జరగలేదు. రాష్ట్రంలోని 21 వేల నీటి వనరులకుగాను 3 వేల చెరువులు, కుంటల్లోనే చేపలను వదిలారు. మిగిలిన కోట్లాది చేపల్ని ఎప్పుడు వదులుతారో స్పష్టత లేదు. నీటిపారుదల వర్గాల లెక్కల ప్రకారం ఇటీవలి భారీ వర్షాలకు అనేక జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి అవసరమైన స్థాయిలో నీరొచ్చింది. కానీ ఆ సమయంలో అధికారులు మేలుకోకపోవడంతో పూర్తిస్థాయిలో చేపలను వదలలేకపోయారని ప్రజలు చెబుతున్నారు.      
– సాక్షి, హైదరాబాద్‌

ఈసారి 74.73 కోట్లు 
మత్స్యకారులను ఆర్థి కంగా బలోపేతం చేసేందుకు మత్స్యకార సొసైటీల ద్వారా ‘ఉచిత చేప పిల్లల పంపిణీ’కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రెండేళ్లుగా చేప పిల్లలలను ఉచితంగా పం పిణీ చేస్తూ వస్తోంది. పథకంతో 4 లక్షల మత్స్య కార కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలనేది సర్కారు సంకల్పం. ఈ ఏడాది 74.73 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. 21,569 నీటి వనరుల్లో చేప పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటివరకు 3,147నీటి వనరుల్లో 11.40 కోట్ల చేప పిల్లలనేవదిలినట్లు ప్రభుత్వానికి మత్స్య శాఖ వెల్లడించింది. అంటే లక్ష్యంలో 15.25 శాతమే.  

ఆ జిల్లాల్లో ..
కొన్ని జిల్లాల్లో  దారుణంగా చేప పిల్లల పంపిణీ జరిగింది. ఆదిలాబాద్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో అక్కడి 160 నీటి వనరుల్లో 99.68 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయాలనుకున్నారు. కానీ  6 నీటి వనరుల్లో 7.67 లక్షలనే వదిలారు. భద్రాద్రి జిల్లాలోనూ కుండపోత వర్షాలు కురిశాయి.  ఆ జిల్లాలో 702 నీటి వనరుల్లో 2.03 కోట్ల చేపలను వదలాలనుకున్నారు. కానీ 2 నీటి వనరుల్లో 3.82 లక్షల చేపలనే వదిలిపెట్టారు. కొమురంభీం జిల్లాలో 242 నీటి వనరుల్లో 1.14 కోట్ల చేపలను వదలాలనుకున్నా కేవలం ఒకే నీటి వనరులో 70 వేల చేపలను వదిలారు. గతం లో ఆలస్యంగా అక్టోబర్‌ వరకు చేప పిల్లల పంపిణీ జరగడంతో అప్పటికే అనేకచోట్ల మత్స్యకారులు సొంతంగా చేపలను కొన్నారు. దీంతో ఈసారి ఆగస్టు మూడు లేదా చివరి వారంలోనే చేపలను వదలాలని అనుకున్నా.. గడువులోగా చేయలేకపోయారు. దీంతో మిగిలిన  చేప పిల్లలను పంపిణీ చేయడానికి ఏ మేరకు అవకాశం ఉంటుందోనని చర్చ జరుగుతోంది. 

ఏటికేడు లక్ష్యం పెంపు
2016– 17లో చేప పిల్లల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది.  రూ. 22 కోట్లు ఖర్చు చేసి 27 కోట్ల చేప పిల్లలను వదిలింది. 2017–18లో రూ. 44 కోట్లతో 51 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసింది. గతేడాదితో పోలి స్తే ఈసారి 23.72 కోట్లు అదనంగా 74.73 కోట్ల చేపల పంపిణీకి సిద్ధ మైంది. ఇలా ఏటికేడు పంపిణీ లక్ష్యం పెరుగుతోంది. కానీ సకాలంలో చేపలను వదలడంలోనే అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు విని పిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు