ఆగస్టులో గేదెల పంపిణీ: తలసాని 

24 Jul, 2018 02:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాడి గేదెల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు మొదటివారంలో ప్రారంభించనున్నట్లు పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. పాడి గేదెల పంపిణీ విధివిధానాలపై వివిధ జిల్లాల పశుసంవర్థకశాఖ అధికారులతో మంత్రి తలసాని, పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, అడిషనల్‌ డైరెక్టర్‌ రాంచందర్‌ సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

మంత్రి మాట్లాడుతూ.. విజయడెయిరీ, ముల్కనూర్, మదర్‌ డెయిరీ, కరీంనగర్‌ డెయిరీల్లో సభ్యులుగా ఉన్న 2.13 లక్షల మందికి సబ్సిడీపై పాడిగేదెలు, ఆవులను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రస్థాయిలో విజయ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారని, జిల్లాస్థాయిలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. గేదెల కొనుగోలుపై లబ్ధిదారులకు అవగాహన కలిగించేందుకు సదస్సులు నిర్వహించాలని అధికారులకు సూచించా రు. పంపిణీ చేసే గేదెలకు ఒక్కో దానికి యూనిట్‌ ధరలో 3 ఏళ్ల పాటు బీమా, 300 కిలోల దాణా ఇస్తామన్నారు. అంతేకాకుండా అదనంగా రూ.5 వేలు చెల్లిస్తామన్నారు. 

31 నుంచి చేప పిల్లల పంపిణీ
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 31న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారం భించనున్నట్లు పశుసంవర్థక మంత్రి తలసాని వెల్లడించారు. చేప పిల్లల విడుదల ఏర్పాట్లపై సోమ వారం సచివాలయంలో మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ, ఇతర మత్స్యశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న ఘన్‌పూర్‌ చెరువులలో తాను స్పీకర్‌తో కలసి చేపపిల్లలను విడుదల చేస్తామని తెలిపారు. మంత్రి చందులాల్‌తో కలసి ములుగు నియోజకవర్గంలోని రామప్ప చెరువులో చేపపిల్లలను విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించామన్నారు.

చేపపిల్లల నాణ్యత విషయంలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, విడుదల కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరణ చేయాలని అధికారులకు సూచించారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సబ్సిడీపై వాహనాలను ఆగస్టు నెలాఖరు నాటికి అందించే విధంగా చర్య లు తీసుకోవాలన్నారు. మత్స్యరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రభు త్వం అన్ని విధాల సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి పెట్టుబడిదారులకు అనువుగా ఉండే స్థలాలను గుర్తించడానికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖతో సమన్వయపర్చుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు