129 మంది గిరిజనులకు కార్ల పంపిణీ 

29 Mar, 2018 02:39 IST|Sakshi
కార్ల పంపిణీని జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రి చందూలాల్‌

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: చందూలాల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకుంటూ తమ జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాలని గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ సూచించారు. ప్రకృతితో మమేకమై బతుకుతున్న గిరిజనులు బాహ్య ప్రపంచంలో పోటీతత్వంతో జీవనం సాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఓన్‌ యువర్‌ కార్‌ పథకంలో భాగంగా బుధవారం ఇక్కడ 129 మంది గిరిజనులైన లబ్ధిదారులకు కార్లను పంపిణీ చేశారు. ఈ పథకంలో ఉబర్‌ క్యాబ్స్‌తోపాటు మారుతి, భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ భాగస్వాములయ్యాయి.

మంత్రి మాట్లాడుతూ, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌కు బాధ్యతలు అప్పగించామన్నారు. అన్నివర్గాలకు దీటుగా గిరిజనులను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వివిధ రంగాల్లో ఉపాధి కల్పన కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.400 కోట్లు ఖర్చు చేయబోతున్నామని, దీంతో 7 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు.   ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి మహేశ్‌ దత్త ఎక్కా, కమిషనర్‌ క్రిస్టినా, మారుతి సుజికి సంస్థ వాణిజ్య, వ్యాపార విభాగం అధిపతి ఆశిష్‌ జైన్, రీజినల్‌ మేనేజర్‌ అనింద్య దత్త తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు