1250 మంది ముస్లింలకు దుస్తుల పంపిణీ

6 Jun, 2018 14:35 IST|Sakshi
దుస్తులు పంపిణీ చేస్తున్న మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి 

మెదక్‌లో రూ.2కోట్లతో షాదిఖానా ఏర్పాటు

నెలరోజుల్లో ఆఖరి సఫారీ వాహనం

పిట్లం చెరువు, గోసముద్రం మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి

వందశాతం ఉత్తీర్ణత సాధించే గురుకులాలకు రూ.1లక్ష నజరానా

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

మెదక్‌ మున్సిపాలిటీ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ముస్లింల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందని రాష్ట్ర  నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన మెదక్‌ పట్టణంలో ముస్లింలకు రంజాన్‌ పండగ సందర్భంగా దుస్తులను పంపిణీ చేశారు.  క్రిస్టల్‌ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారన్నారు.

షాది ముబారక్‌ ద్వారా  యువతుల పెళ్లిళ్లకు రూ.10,0116లు అందజేయడం జరుగుతుందన్నారు. మెదక్‌లో రూ.2కోట్లతో షాదిఖానా నిర్మిస్తున్నట్లు తెలిపారు.  ఈద్గా, మసీదుల మరమ్మతులకు ప్రభుత్వం రూ.2కోట్లు అందిస్తుందని తెలిపారు.  మెదక్‌లో ప్రస్తుతం ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ కాకుండా మరొకటి బాలికలకోసం మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 1250 మంది ముస్లింలకు దుస్తులను పంపిణీ చేశారు. 

సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం

మెదక్‌ జిల్లాను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. మెదక్‌ జిల్లా అయినప్పటికీ సంగారెడ్డి కేంద్రంగా కార్యకలాపాలు సాగేవన్నారు.  రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెదక్‌ను జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దారని తెలిపారు. రూ.100కోట్లతో మెదక్‌ పట్టణానికి ఫుట్‌పాత్, నాలుగు వరుసల రోడ్డు, బట్టర్‌ఫ్‌లై లైట్లతో సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. పట్టణంలో రూ.50 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు నడుస్తున్నట్లు తెలిపారు. చేగుంట రోడ్డును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

పిట్లం చెరువు, గోసముద్రంంలను మీనిట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ముస్లింలకు నెలరోజుల్లో ఆఖరి సఫారి వాహనం అందిస్తామని తెలిపారు.   ప్రతియేడు సిద్దిపేట జిల్లా నుండి 5వేల మంది నిరుపేద ముస్లింలను ఉమ్ర పంపించడం జరుగుతుందన్నారు. ఈ యేడు నుంచి మెదక్‌ జిల్లా నుండి 5 వేల మంది నిరుపేద ముస్లింలను ఉమ్రకు పంపించనున్నట్లు ఆయన తెలిపారు.  డిప్యూటీస్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 260మంది పేద ముస్లింలకు రూ.1.30కోట్లను షాది ముబారక్‌ ద్వారా అందజేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చుతున్నారని తెలిపారు.   

కవర్లను వాడబోమని మాటివ్వండి 

ప్లాస్టిక్‌ కవర్లను ఇకనుండి వినియోగించమని మాటివ్వాలని మంత్రి హరీశ్‌రావు ముస్లింలను కోరగా, వారు వాగ్ధానం చేశారు. ప్లాస్టిక్‌ వినియోగం వల్ల ప్రతియేడు దేశంలో ఎంతోమంది  క్యాన్సర్‌తో చనిపోతున్నారని తెలిపారు.  రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మంత్రి సూచించారు. మంగళవారం మెదక్‌ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద గల బాలికల రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాల అదనపు మౌలిక వసతుల కల్పన ప్రారంభించారు.

ఈయేడు వందశాతం ఉత్తీర్ణత సాధించే గురుకుల పాఠశాలలకు రూ.1లక్ష నజారానా ఇస్తామన్నారు. అలాగే నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ రాగి అశోక్, కౌన్సిలర్లు చంద్రకళ, రాధా, బట్టి సులోచన, జ్యోతి, సలాం, ఆర్కెశ్రీనివాస్, కో అప్షన్‌ సభ్యుడు సాధిక్, నాయకులు హమీద్, షాహెద్, ముస్లిం మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు