లిక్కర్ డిపోల మూసివేత

27 May, 2014 01:48 IST|Sakshi

 మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో మద్యం డిపోలు పది రోజులపాటు మూతపడనున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు మద్యం కోసం చలానాలు కట్టిన వారికి మాత్రమే 27వ తేదీ సాయంత్రం వరకు మద్యం సరఫరా చేయనున్నారు.  ప్రభుత్వ పరమైన లావాదేవీలకు ఎలాంటి చలానైనా బ్యాంకులో చెల్లించడంను ఈ నెల 24వ తేదీ నుంచి నిలిపేశారు. దీంతో 24వ తేదీ తరువాత చలానా కట్టేందుకు మద్యం వ్యాపారులకు వీలు లేకుండా పోయింది.

 మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు జూన్ 2వ తేదీన అధికారికంగా విడిపోనున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ జూన్ 2 నుండే అధికారిక కార్యకలాపాలు సాగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎక్సైజ్ శాఖలో ఆదాయం, అప్పులు, స్థిర చరాస్తుల పంపకాలు పూర్తి చేయాల్సి ఉంది. దీనికి కనీసం పది రోజుల సమయమైన పట్టేఅవకాశం ఉంది. దీంతో జూన్ 6వ తేదీనే మద్యం డిపోలు తెరుచుకోనున్నాయి.

 మూతపడే పది రోజులకు గానూ స్టాక్‌ను ముందస్తుగా కొనుగోలు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం వ్యాపారులకు సూచించడంతో, రోజుకు రూ.2 కోట్లకు పైగా మద్యం పంపిణీ జరుగుతుంతోంది. ఇక గత ఐదు రోజులుగా మద్యం డిపో వద్ద మద్యం వ్యాపారులు బారులు తీరడంతో రోజుకు ఆదాయం రూ.5 కోట్లకు పైగానే ఎక్సైజ్ శాఖకు లభించింది.

 మద్యం కొరతకు దుకాణదారుల మొగ్గు
 జిల్లాలో మంచిర్యాల, ఊట్నూరులో మద్యం డిపోలు ఉన్నా యి. మంచిర్యాల మండలం గుడిపేటలో గల మద్యం డిపో పరిధిలో 65 దుకాణాలు, 8 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నా యి. ఉట్నూరు మద్యం డిపో పరిధిలో 88 దుకాణాలు, 16 బార్లు ఉన్నాయి. గత నాలుగైదు రోజులుగా మద్యం డిపోలు, మద్యం వ్యాపారస్తులతో కిటకిటలాడుతున్నాయి. జూన్ 6వ తేదీ తరువాతే మద్యం డిపోలు తెరుచుకోనుండడంతో, పది రోజులకు సరిపడా మద్యంను వ్యాపారస్తులు ఇదివరకే తరలించారు. మరోవైపు జూన్ 2వ తేదీన కొత్త ప్రభుత్వం ప్ర మాణ స్వీకారం అనంతరం ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాల కోసం మద్యం అవసరం ఉంటుంది. అసలే మ ద్యం కొరత ఉండడంతో, మద్యం వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి మద్యంను అధిక ధరలకు అమ్మేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

 ఇటీవల జరిగిన ఎన్నికల ద్వారా గె లుపొందిన కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎ న్నుకోనుండగా, ఎంపీటీసీలు ఎంపీపీలను, జెడ్పీటీసీలు జె డ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికలు జరిగే తేదీ లను ఇంత వరకు ప్రకటించక పోవడంతో ఎన్నికలయ్యే వర కు వారు చేజారకుండా ఉండేందుకు క్యాంపులు ఏర్పాటు చే స్తున్నారు. దీంతో మద్యంకు డిమాండ్ బాగా ఏర్పడనుంది. దీన్ని ఆసరా చేసుకుని మద్యం దుకాణాల్లో స్టాకు లేదంటూ, కృత్రిమ కొరత సృష్టించేందుకు మద్యం వ్యాపారులు సిద్ధమవుతున్నారు.

మద్యం స్టాకు లేదని, రెట్టింపు ధరలకు మద్యం ను అమ్మేందుకు మద్యం వ్యాపారులు సిద్ధమవుతుండగా, మద్యం ప్రియులకు పది రోజులపాటు జేబులకు చిల్లు పడడం ఖాయంగా కన్పిస్తుంది. దుకాణాల్లో ఉన్న స్టాకును ఎమ్మార్పీ ధరలకు అమ్మేలా ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటే, పది రోజుల వరకు మద్యం ప్రియులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే గత నెలలో జరిగిన ఎన్నికల పుణ్యమా అని మద్యం దొరక్క పడ్డ ఇబ్బందులు, మళ్లీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు