కొత్త పాస్‌ బుక్కులొచ్చాయ్‌!

6 Jul, 2018 01:37 IST|Sakshi

70 వేల పుస్తకాల్లో తప్పుల సవరణ

సవరించిన మేరకు ముద్రణ పూర్తి

జిల్లాలకు చేరుకున్న కొత్త పుస్తకాలు

పాత పుస్తకం ఇస్తేనే కొత్తది

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతులకు పాస్‌ పుస్తకాల పంపిణీలో మరో దశ మొదలైంది. తొలిదశలో పంపిణీ చేసిన పాస్‌ పుస్తకాల్లో వచ్చిన తప్పులను సవరించారు. అనంతరం ముద్రించిన 70 వేల పాస్‌పుస్తకాలు పంపిణీకి సిద్ధమయ్యాయి. తప్పులను సరిచేసిన ఈ పుస్తకాల ముద్రణ బుధవారం రాత్రి పూర్తి కాగా, గురువారం ఉదయం నుంచే ఉన్నతాధికారులు జిల్లాలకు పంపారు. వెంటనే వీటి పంపిణీ చేపట్టాలంటూ భూపరిపాలన ప్రధాన కమిషనరేట్‌ (సీసీఎల్‌ఏ) డైరెక్టర్‌ వాకాటి కరుణ అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు పంపారు.

ఆపసోపాల నడుమ..
రాష్ట్రంలో మొత్తం 50 లక్షలకు పైగా ఖాతాలకు పాస్‌పుస్తకాల ముద్రణ అవసరమని రెవెన్యూ యంత్రాం గం నిర్ధారించింది. అందులో అన్ని వివరాలు అందిన 48 లక్షలకు పైగా పుస్తకాలను ముద్రించింది. వీటిలో దాదాపు 7 లక్షల పుస్తకాల్లో తప్పులు దొర్లినట్లు గుర్తించింది. ముందే గుర్తించిన 4 లక్షలకు పైగా పుస్తకాలను పంపిణీ చేయకుండానే నిలిపేయగా, మరో 3 లక్షల పుస్తకాల్లో తప్పులు వచ్చినట్లు పంపిణీ తర్వాత గుర్తించారు.

తమ వివరాల్లో తప్పులు వచ్చాయన్న రైతుల ఫిర్యాదుతో ధరణి వెబ్‌సైట్‌ ద్వారా రెవెన్యూ యంత్రాంగం సరిచేసే పనిలో పడింది. అయితే ధరణి వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలతో తప్పులు సరిచేసేందుకు 2 నెలలుగా రెవెన్యూ యంత్రాంగం ఆపసోపాలు పడుతోంది. లక్ష వరకు పాస్‌పుస్తకాల్లోని తప్పులను నిర్ధారించిన ఫార్మాట్‌లో సరిచేశారు. గత నెల 20న ఈ పుస్తకాలను తిరిగి ముద్రించే పని ప్రారంభమైంది. బుధవారం నాటికి 70 వేల పుస్తకాలు సీసీఎల్‌ఏకు అందాయి.

తప్పులు చూశాకే పంపిణీ..
మొదటి విడతలో భాగంగా వచ్చిన పుస్తకాలు వచ్చి నట్లు అందజేశారు. అయితే వాటిలో తప్పులు వచ్చినట్లు పంపిణీ తర్వాత గుర్తించారు. దీంతో ఈ పొరపాటు మళ్లీ జరగకుండా పాస్‌పుస్తకాల పంపిణీకి మార్గదర్శకాలు తయారు చేశారు. ఈ పుస్తకాలను మళ్లీ కలెక్టర్లు సరిచూడాలని, ఎలాంటి తప్పుల్లేవని నిర్ధారించుకున్నాకే రైతులకు ఇవ్వాలని డైరెక్టర్‌ కరుణ ఆదేశించారు. ఒకవేళ మళ్లీ తప్పులుంటే ‘ఎర్రర్‌.. రీప్రింట్‌’అనే ప్రొఫార్మాలో తిరిగి పంపాలని వెల్లడించారు. అలాగే రైతు పాత పుస్తకం తిరిగి ఇచ్చిన తర్వాతే కొత్త పుస్తకం ఇవ్వాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు