కేంద్రం వాటా తేలాకే బియ్యం పంపిణీ! 

28 Mar, 2020 03:30 IST|Sakshi

స్పష్టత కోసం రాష్ట్రం ఎదురుచూపులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన రేషన్‌ బియ్యం పంపిణీని తిరిగి ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కేంద్ర పరిధిలోని ఆహార భద్రతా కార్డుదారులందరికీ 5 కిలోల వంతున ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో దీనిపై స్పష్టత వచ్చాక 12 కిలోల ఉచిత పంపిణీని ప్రభుత్వం కొనసాగించనుంది. దీనిపై కేంద్రంతో రాష్ట్రం చర్చలు ఆరంభించగా, ఒకట్రెండు రోజుల్లో కోటా బియ్యం పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్రంపై తగ్గనున్న భారం.. 
రాష్ట్రంలో మొత్తంగా 87.59 లక్షల కుటుంబాలకు రేషన్‌ అందుతుండగా, ఇందులో కేంద్రం ఆహార భద్రతా చట్టం పరిధిలో 53.29లక్షల మందిని గుర్తించింది. కేంద్రం గుర్తించిన కార్డుల్లో లబ్ధిదారుల సంఖ్య 1.91 కోట్లు ఉండగా, రాష్ట్రం బియ్యం పంపిణీ చేస్తున్న లబ్ధిదారుల సంఖ్య 2.80కోట్ల వరకుఉంది. కేంద్రం కిలో రూ.4.40 వంతున ఒక్కో లబ్ధిదారునికి కేవలం 5 కిలోల బియ్యం సరఫరా చేస్తుండగా రాష్ట్రం ఒక్కొక్కరిరి 6 కిలోల వంతున కిలో రూపాయికే సరఫరా చేస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులు ఒక్కొక్కరికి 12 కిలోల ఉచిత బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించింది.

దీంతో ప్రభుత్వం రూ.1,103కోట్ల భారాన్ని మోసేందుకు సిద్ధమైంది. దీంతోపాటే నిత్యావసరాలకు రూ.1,500 వంతున సాయాన్ని ప్రకటించింది. ముందుగా రేషన్‌ బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించినా, కేంద్రం ఉచిత 5 కిలోల ప్రకటన నేపథ్యంలో దాన్ని నిలిపివేసింది. కేంద్ర పరిధిలో ఉన్న 1.91కోట్ల మందికి 5 కిలోల వంతున బియ్యం పంపిణీ చేసినా రాష్ట్రంపై 95 వేల మెట్రిక్‌ టన్నుల మేర బియ్యం భారం తప్పుతుంది. దీని విలువ సుమారు రూ.305 కోట్ల వరకు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం ప్రకటించిన బియ్యం ఎప్పటినుంచి సరఫరా చేస్తారన్న దానిపై మార్గదర్శకాలు రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు