జూన్‌ 20కల్లా చెక్కుల పంపిణీ పూర్తవ్వాలి: సీఎస్‌ 

26 May, 2018 01:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జూన్‌ 20కల్లా పట్టాదారు పాస్‌పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ పూర్తి కావాలని సీఎస్‌ ఎస్‌కే జోషి స్పెషలాఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో సీఎస్‌.. పాస్‌బుక్కులు, చెక్కుల పంపిణీ పర్యవేక్షణకు నియమించిన స్పెషలాఫీసర్లతో సమావేశమయ్యారు. జిల్లాల్లో పర్యటించి పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీ సజావుగా జరిగేలా చూడాలని.. ఈ మేరకు కలెక్టర్లకు మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. మండల అధికారుల టీంలు ప్రతీ గ్రామంలో పర్యటించేలా చూడాలని చెప్పారు. పాస్‌పుస్తకాల్లోని తప్పులపై దృష్టి సారించి, వాటిని సరిదిద్దేందుకు దృష్టి సారించాలన్నారు.

మంత్రులతో సమన్వయం చేసుకొని స్పెషల్‌ డ్రైవ్‌ తరహాలో చేపట్టాలన్నారు.  ఇప్పటివరకు దాదాపు 40 లక్షల పాస్‌పుస్తకాలు పంపిణీ చేశామని.. మిగిలిన వాటి పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్‌ అనుసంధానించిన ఖాతాలకు డిజిటల్‌ సిగ్నేచర్లను సత్వరం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో స్పెషలాఫీసర్లు అజయ్‌ మిశ్రా, చిత్రా రామచంద్రన్, అధర్‌ సిన్హా, సునీల్‌ శర్మ, రామకృష్ణారావు, సోమేశ్‌ కు
మార్, వికాస్‌రాజ్, జయేశ్‌రంజన్, శివశంకర్, శశాంక్‌ గోయల్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు