కదిలించిన చిన్నారుల కథనం

9 Nov, 2017 03:20 IST|Sakshi
నల్లగొండలోని శిశుగృహాన్ని సందర్శించి, పిల్లల ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్న కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌

     స్పందించిన జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌

     అధికారులు, వైద్యులతో కలసి శిశుగృహ సందర్శన

     పిల్లల ఆరోగ్య రక్షణకు రెండు టీముల ఏర్పాటు

     మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశం

     నిలోఫర్‌ రిపోర్టులు వచ్చాక బాధ్యులపై చర్యలు 

నల్లగొండ: శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న అనాథ చిన్నారులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు చేపడ తామని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు. బుధ వారం ‘సాక్షి’ మెయిన్‌లో ప్రచురితమైన ‘చిన్నారుల మృత్యు ఘోష’ కథనంపై జిల్లా అధికార యంత్రాంగం కదిలింది.  డీఆర్వో, ఆర్డీవో, సంక్షేమ శాఖల అధికారులతో కూడిన కమిటీ శిశుగృహను సందర్శించి ప్రాథమికవిచారణ జరిపారు. సాయంత్రం జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్, డీఎంహెచ్‌వో భానుప్రసాద్, జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్, ప్రభుత్వ వైద్యులతోపాటు మహిళా శిశు కో–ఆర్డినేటర్‌ మాలె శరణ్యారెడ్డి శిశుగృహను సందర్శించారు. సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలకు ఆదేశించారు.

పిల్లల ఆరోగ్యం, శిశుగృహ అభివృద్ధి  కోసం మహిళా అధికారులతో కమిటీ వేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. పౌష్టికాహారం, శానిటేషన్‌కు సూచనలిచ్చేందుకు ఐదుగురు వైద్యులతో మరో కమిటీని నియమి స్తున్నట్లు తెలిపారు.  శిశువుల ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు శాశ్వతంగా వైద్యుడిని ముగ్గురు స్టాఫ్‌ నర్సులను నియమిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించే పిల్లలపై శ్రద్ధ తీసుకునేలా సూపరిం టెండెంట్‌తో మాట్లాడతానని చెప్పారు. నిలోఫర్, కామినేని ఆసుపత్రులకు తరలించే చిన్నారుల ఆరోగ్యంపై వైద్యులు, అధికారులతో మాట్లాడేందుకు ఐదుగురు వైద్యుల కమిటీ పనిచేస్తుందని కలెక్టర్‌ తెలిపారు. పిల్లల ఆరోగ్యంపై ఎంత ఖర్చయినా భరిస్తామని చెప్పారు. చిన్నారుల నివేదికలు పరిశీలించి, అందుకు గల కారణాలను తెలుసుకున్న తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు