కొలువుదీరిన పురాధీశులు

4 Jul, 2014 02:57 IST|Sakshi
కొలువుదీరిన పురాధీశులు

 - జిల్లా అంతటా టీఆర్‌ఎస్ హవా
 - తొమ్మిది చోట్ల పాగా  
 - చేజిక్కిన జగిత్యాల
 - ఎములాడ కమలానికే..
 - రెండింటా ఎమ్మెల్యేలే కీలకం

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జయకేతనం ఎగరేసింది. జిల్లాలోని తొమ్మిది పట్టణాల్లో పురాధీశుల పీఠాలను దక్కించుకుంది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు సిరిసిల్ల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలు, పెద్దపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్ నగర పంచాయతీలను సొంతం చేసుకుంది. మెజారిటీ సభ్యుల బలం లేకున్నా వ్యూహాత్మకంగా చక్రం తిప్పి రామగుండం, కోరుట్ల స్థానాలను కైవశం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠ రేపిన రామగుండం, హుస్నాబాద్ నగర పంచాయతీలను తమ ఎమ్మెల్యేల ఓట్లతో ఖాతాలో వేసుకుంది.

టీఆర్‌ఎస్ దూకుడుతో అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. స్పష్టమైన ఆధిక్యత ఉన్న జగిత్యాల మున్సిపాలిటీ ఒక్కటే చేజిక్కించుకొని పరువు కాపాడుకుంది. ఓ కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేసిన ఫిర్యాదుపై ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లను అరెస్టు చేయటం, తదనంతర పరిణామాల హైడ్రామాతో కోరుట్ల ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ చేజార్చుకుంది. బీజేపీ వేములవాడ నగరపంచాయతీని దక్కించుకుని మున్సిపల్‌లో బోణీ చేసింది.

రామగుండం కార్పొరేషన్‌లో మేయర్ ఎన్నికలో ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణల ఓట్లే కీలకమయ్యాయి. ఒక్క ఓటు ఆధిక్యంతో టీఆర్‌ఎస్ మేయర్ పదవిని దక్కించుకొని ఊపిరి పీల్చుకుంది. ఇండిపెండెంట్‌గా గెలిచిన కొంకటి లక్ష్మీనారాయణ పార్టీలో చేరడంతో టీఆర్‌ఎస్ ఆయనను మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. హుస్నాబాద్ నగర పంచాయతీలోనూ ఎమ్మెల్యే సతీష్‌బాబు ఓటుతోనే టీఆర్‌ఎస్ గట్టెక్కింది.

హుజురాబాద్‌నగరపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన విజయ్‌కుమార్ టీఆర్‌ఎస్‌లో చేరి ఛైర్మన్‌గా గెలుపొందారు. పెద్దపల్లిలో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన టీడీపీ సభ్యులు.. తీరా ఎన్నిక సమయంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎల్.రాజయ్యకు మద్దతునిచ్చి గెలుపునకు సహకరించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్‌అఫిసియో సభ్యులకు ఓటుండడం అధికార టీఆర్‌ఎస్‌కు బాగా కలిసొచ్చింది.

మరిన్ని వార్తలు