రోజుకో హైడ్రామా

9 Mar, 2017 03:16 IST|Sakshi

సాక్షి, నల్లగొండ :జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) వ్యవహారంలో రోజుకో హైడ్రామా నడుస్తోంది. 90 రోజులుగా నాటకీయ మలుపులు తిరుగుతున్న సెంట్రల్‌ బ్యాంకు పరిణామాలు రోజులు గడిచే కొద్దీ రసవత్తరంగా మారుతున్నాయి. సహకార శాఖ అధికారులు ఒకలా వ్యవహరిస్తుంటే.. హైకోర్టు ఉత్తర్వులు మరోలా ఉన్నాయి. చైర్మన్‌ వ్యవహారశైలి ఓ విధంగా ఉంటే.. రెబల్‌ డైరెక్టర్లు మరోలా వ్యవహరిస్తూ గందరగోళానికి తెర లేపుతున్నారు. ఈ నేపథ్యంలో నాటకీయంగా పాండురంగారావే చైర్మన్‌ అంటూ సహకార రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు ఇవ్వడం, అసలు కాపుగల్లు సొసైటీని రద్దు చేయడంపై స్టే ఇస్తూ సహకార ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం, తన అధ్యక్షతనే గురువారం డీసీసీబీ పాలకమండలి సమావేశం జరుగుతుందని పాండురంగారావు ప్రకటించడం వంటి అంశాలు సెంట్రల్‌ బ్యాంకు రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి.

అప్పటి నుంచీ..
వాస్తవానికి కాపుగల్లు సహకార సొసైటీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిన అనంతరం ఆ సొసైటీని రద్దు చేస్తూ గతేడాది జనవరి 8న సూర్యాపేట జిల్లా సహకార అధికారి లక్ష్మినారాయణ ఉత్తర్వులు ఇచ్చారు. కాపుగల్లు సొసైటీ పాలకమండలిని రద్దు చేయడంతో ఆ సొసైటీ చైర్మన్‌గా ఉన్న పాండురంగారావు తన పదవిని కోల్పోయి, తదనుగుణంగా డీసీసీబీ చైర్మన్‌గా కూడా అనర్హులవుతారని చట్టం చెబుతోంది. అయితే, డీసీఓ తీసుకున్న నిర్ణయంపై పాండురంగారావు హైకోర్టును ఆశ్రయించడంతో సహకార ట్రిబ్యునల్‌కి వెళ్లాలని సూచిస్తూ హైకోర్టు ఆయనకు రెండు వారాల గడువిచ్చింది. ఈ మేరకు సహకార ట్రిబ్యునల్‌ను జనవరి 5న పాండురంగారావు ఆశ్రయించడంతో సూర్యాపేట డీసీఓ ఇచ్చిన ఉత్తర్వులపై ట్రిబ్యునల్‌ స్టే ఇచ్చింది.

అయితే దీన్ని సవాల్‌ చేస్తూ జనవరి 11న కొందరు హైకోర్టుకెళ్లారు. మళ్లీ హైకోర్టు నాలుగు వారాల పాటు ట్రిబ్యునల్‌ స్టేపై సస్పెన్షన్‌ విధించింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట డీసీఓ తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చినట్టయింది. అయితే హైకోర్టు నాలుగు వారాలకే ఇచ్చిన ఉత్తర్వుల గడువు అయిపోవడంతో కాపుగల్లు సొసైటీ చైర్మన్‌గా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ పాండురంగారావు సూర్యాపేట డీసీఓను ఫిబ్రవరి 11న కోరారు. అయితే దీనిపై న్యాయ అభిప్రాయం కోసం సూర్యాపేట డీసీఓ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదికి అదే రోజు లేఖ రాయగా, ఆయన 16న సమాధానమిచ్చారు. సదరు హైకోర్టు న్యాయవాది డీసీఓ రాసిన లేఖకు బదులిస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే గడువు ముగిసినప్పటికీ, స్టేను ఎత్తివేసేంతవరకు అమల్లోనే ఉంటుందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇందుకు 2016లో జస్టిస్‌ సురేశ్‌కుమార్‌కైత్‌ ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఉటంకించారు. పాండురంగారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సొసైటీని రద్దు చేస్తూ సూర్యాపేట డీసీఓ ఇచ్చిన ఉత్తర్వులు హైకోర్టు ఆదేశాల మేరకు కొనసాగుతాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

మళ్లీ బెంచ్‌ మీదకు..
అయితే సూర్యాపేట డీసీఓ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇస్తూ సహకార ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో సవాల్‌ చేసిన కేసు ఈనెల 2 న మళ్లీ బెంచ్‌ మీదకు వచ్చింది. ఈలోపే పాండురంగారావు వ్యూహాత్మకంగా వ్యవహరించి కాపుగల్లు సొసైటీ చైర్మన్‌గా ప్రత్యేకాధికారి నుంచి బాధ్యతలను మార్చి 1న లిఖితపూర్వకంగా తీసుకుని మినిట్స్‌ బుక్‌లో రాశారు. ఈనెల 2న హైకోర్టు ట్రిబ్యునల్‌ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు, దానిపై హైకోర్టులో సవాల్‌ చేసిన ఉదంతం ఇలా ఉండగా, బ్యాంకు డైరెక్టర్లు 10 మంది గత నెల 22న హైకోర్టును మళ్లీ ఆశ్రయించారు. డీసీసీబీ చైర్మన్‌ విషయంలో ఎన్నికలు నిర్వహించాలని బ్యాంకు వర్గాలు ఎన్నిసార్లు లేఖలు రాసినా సహకార రిజిస్ట్రార్‌ స్పందించడం లేదని, ఈ విషయంలో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోర్టు మెట్లెక్కారు. దీంతో హైకోర్టు డీసీసీబీలో నెలకొన్న సమస్యను 15 రోజుల్లోగా పరిష్కరించాలని అదే రోజున ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సహకార శాఖతో పాటు జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.

 ఇదిలావుండగా సహకార చట్టాలు డీసీసీబీ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించేందుకు తమను అనుమతించబోవని, దీనిపై నిర్ణయం మీరే తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌ సహకార రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో 1వ తేదీన కాపుగల్లు చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నందున డీసీసీబీ చైర్మన్‌గా ఉంటారని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని సహకార రిజిస్ట్రార్‌ ఈనెల 6న ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అందుకున్న పాండురంగారావు వెంటనే 7న డీసీసీబీలో సమావేశం నిర్వహించారు. అధికారులతో సమీక్షించి 9 న పాలకవర్గం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మళ్లీ 8న రెబల్‌ డైరెక్టర్లు ఈనెల 2న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను మీడియాకు అందజేశారు.

 దీంతో పాటు నేడు జరగనున్న పాలకమండలి సమావేశానికి పాండురంగారావు హాజరు కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ విధంగా మూడు నెలలుగా సెంట్రల్‌ బ్యాంకు చేయాల్సిన కార్యకలాపాలు నిర్వీర్యమయ్యాయి. ఒకరిపై ఒకరు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ కోర్టులు, ట్రిబ్యునళ్ల చుట్టూ తిరుగుతూ సెంట్రల్‌ బ్యాంకు ను వివాదాలకు కేంద్ర బిందువుగా చేయడం గమనార్హం. మరీ, గురువారం జరగనున్న పాలకమండలి సమావేశం అసలు జరుగుతుందా.. లేదా ? ఎలా జరుగుతుంది. హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును సహకార శాఖ ఏ విధంగా పరిగణిస్తుంది.. చైర్మన్‌ ఏం చేస్తారు? డైరెక్టర్లు ఏ విధంగా వ్యవహరిస్తారు? సమావేశానికి సరిపడా కోరం ఉంటుందా? రెబల్స్‌ సమావేశానికి వస్తారా.. రారా.. వస్తే ఏం చేస్తారు? అనేది ఇప్పుడు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది.

>
మరిన్ని వార్తలు