క్లియరెన్స్ ప్లీజ్..!

13 Jul, 2014 04:05 IST|Sakshi
క్లియరెన్స్ ప్లీజ్..!

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :  జిల్లా అభివృద్ధికి అటవీ శాఖ అనుమతులు ప్రతిబంధకాలుగా మారాయి. ఫారెస్టు క్లియరెన్స్ రాక జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. ఏళ్లుగా ఈ అనుమతులు లేక పనులు అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి. ఆ పనులకు అనుమతులు మంజూరు చేయడంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు నిబంధనల పేరుతో తీవ్ర జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో ఈ అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. స్మగ్లర్లు నిత్యం రూ.కోట్లు విలువ చేసే టేకు కలపను అక్రమంగా రవాణా చేస్తున్నా పట్టించుకోని అటవీ శాఖ అధికారులు.. అభివృద్ధి పనులకు అనుమతుల విషయంలో మాత్రం నానా కొర్రీలు పెడుతున్నారనే విమర్శలున్నాయి. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జోగు రామన్న రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఈ అనుమతుల విషయంలో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లా మంత్రి చొరవ చూపి తన శాఖ పరిధిలోని అనుమతులు వీలైనంత త్వరగా మంజూరు చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.

 అటవీ శాఖ కొర్రీలు..
 ఏదైనా అభివృద్ధి పనులకు రిజర్వు ఫారెస్టు భూములు అవసరమైతే.. ఆ భూమికి బదులు మరోచోట నిర్ణీత విస్తీర్ణంలో భూమిని అటవీ శాఖకు అప్పగించాలి. అందులో భాగంగానే.. ఇలా వివిధ అభివృద్ధి పనులకు సేకరించిన అటవీ భూములకు బదులు మరోచోట భూమిని అటవీ శాఖకు అప్పగిస్తూ జిల్లా ఉన్నతాధికారుల నుంచి వెళ్లిన ప్రతిపాదనలు ఏళ్ల తరబడి అటవీ శాఖ ప్రిన్సిపాల్ కన్జర్వేటర్ కార్యాలయంలో మూలుగుతున్నాయి. పరిశీలన పేరుతో తీవ్ర జాప్యం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇలా బదులుగా ఇచ్చే భూముల్లో మొక్కలు నాటేందుకు వీలుగా లేదనే కొర్రి పెట్టి కొన్ని ప్రతిపాదనలు తిరస్కరణకు గురవుతుండటంతో భూసేకరణకు రెవెన్యూ ఇతర శాఖల అధికారులు చేసిన ప్రక్రియ అంతా మొదటికొస్తోంది. దీని ప్రభావం అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి కాకపోగా, పలు పనులు అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి. దీంతో నిధులు ఖర్చయినా ఆయా పనుల ప్రయోజనాలు జిల్లా వాసులకు అందడం లేదు. కొన్ని అభివృద్ధి పనులైతే అటవీ శాఖ అనుమతులు రాక పెండింగ్‌లో పడిపోవడంతో వాటి అంచనా వ్యయాలు అమాంతం పెరిగి సర్కారుకు ఆర్థిక భారంగా మారుతోంది.

 మచ్చుకు కొన్ని..
రోడ్లు, భవనాల శాఖ : ఈ శాఖ పరిధిలో ఉట్నూర్-ఆసిఫాబాద్ రహదారి విస్తరణకు నిధులు మంజూరయ్యాయి. ఈ పనులకు సంబంధించి ఖైరిగూడ ఘాట్ వద్ద సుమారు ఆరు కిలోమీటర్ల మేరకు ఈ పనులకు అటవీ శాఖ అనుమతి లభించాల్సి ఉంది. అలాగే సాంగ్వి-నిస్సాని రోడ్డుకు కూడా ఫారెస్టు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం బెల్లంపల్లి డీఎఫ్‌వో పంపిన ప్రతిపాదనలు అటవీ శాఖ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ కార్యాలయంలో మూలుగుతున్నాయి.

ఖానాపూర్ బైపాస్ రోడ్డుకు, నవాబ్‌పేట్ నుంచి బీర్సాయిపేట్ రహదారి, ఇటిక్యాల నుంచి సిరిచెల్మ, భీంపూర్ రోడ్డు, నాగిని నుంచి సేర్‌పల్లి, అనార్‌పల్లి నుంచి బాబుల్‌గూడ, ఆదిలాబాద్ నుంచి బోథ్, బోథ్ నుంచి అడెల్లి, లక్ష్మాపూర్ నుంచి పరందోలి ఇలా పలు రహదారులకు అటవీ శాఖ క్లియరెన్సుల అవసరం ఏర్పడింది. వీటికి తక్షణం అనుమతులు మంజూరు చేస్తే పనులు పూర్తయ్యే అవకాశాలుండగా, మరికొన్ని ప్రారంభానికి నోచుకుంటాయి.

విద్యుత్ సౌకర్యం సరిగ్గా లేక చీకట్లో నివాసముంటున్న మారుమూల గిరిజన గూడాలకు సౌర వెలుగులను అందించేందుకు డీడీజీ ప్రాజెక్టు చేపట్టారు. ఉట్నూర్ మండలం సాట్‌నాపూర్, ఖానాపూర్ మండలం సాకరిగూడ, చామన్‌పల్లిలకు ఈ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అయితే.. వీటికి అటవీ శాఖ అనుమతులు మంజూరు కావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు