ఆదివాసీల గురించి మాట్లాడరేం?

28 May, 2014 22:52 IST|Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: సామాజిక తెలంగాణ అని కపట ప్రేమ ఒలకబోస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పోలవరం ఆదివాసీల గోడు వినిపించడం లేదని తెలంగాణ జేఏసీ జిల్లా తూర్పు విభాగం చైర్మన్ వెదిరె చల్మారెడ్డి విమర్శించారు. పోలవరంపై కేంద్ర ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ గురువారం తెలంగాణ బంద్ పాటించాలన్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపును ఆయన స్వాగతించారు. ఈ మేరకు బుధవారం జేఏసీ తరఫున పత్రికా ప్రకటన విడుదల చేశారు.

అనంతరం మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇప్పటినుంచే తెలంగాణ ప్రాంతాన్ని, గిరిజనులను పోలవరంలో ముంచేయాలని కుట్రలు పన్నుతున్నారని చల్మారెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని 7 ఆదివాసీ మండలాలను సీమాంధ్ర రాష్ట్రంలో కలిపేలా చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆర్డినెన్స్ జారీ చేయించారని, నిర్వాసితుల గురించి కనీసం ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం శోచనీయమని  పేర్కొన్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి సీమాంధ్రపైనే ఎక్కువ ప్రేమ ఉందని, సీమాంధ్ర రాజధాని ఏర్పాటు కోసం రూ.2లక్షలు ఇవ్వడంతోనే ఇది రుజువైందని అన్నారు.  తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదని, న్యాయపోరాటానికి జేఏసీ, ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణకు అన్యాయం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రల్ని భగ్నం  చేసేందుకు గురువారంనాటి బంద్‌లో ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు, అన్ని వర్గాలు, ఆయా జేఏసీలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 బంద్‌కు టీయూటీఎఫ్ మద్దతు
 ఆలంపల్లి: పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు నిరసనగా కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారంనాటి బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు కైలాసం, విఠల్‌లు ఒక ప్రకటనలో తెలిపారు.
 
 యూటీఎఫ్ మద్దతు...
 గురువారం బంద్‌కు  మద్దతు తెలుపుతున్నట్లు  యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.మాణిక్‌రెడ్డి, యూ.ఆంజనేయులు,  సీహెచ్ వెంకటరత్నం, రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏవీ సుధాకర్‌లు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహారించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

 సహకరించాలి
 అనంతగిరి: గురువారం తమ పార్టీ అధినేత కేసీఆర్ పొలవరం ముంపు ప్రాంతాలను సీమంద్రలో కలుపుతూ కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన బంద్ పిలుపును విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ నాయకుడు శుభప్రద్ పటేల్ తెలిపారు. బంద్‌కు వ్యాపార ,వాణిజ్య సముదాయాలు, ప్రజలు సహకరించాలన్నారు.బంద్‌లో విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలన్నారు.  ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్‌ను వెనుకకు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 వాయిదా
 తెలంగాణ బంద్ నేపథ్యంలో గురువారం కొత్తపేటలోని బీజేఆర్ భవన్‌లో నిర్వహించే కళాశాలల యాజమాన్యాల సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వి.వి.రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మళ్లీ సమావేశం నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు.

 ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలి
 మేడ్చల్: ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను సీమాంధ్రలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ గురువారం టీఆర్‌ఎస్ చేపట్టనున్న తెలంగాణ బంద్‌కు టీజేఏసీ సంపూర్ణ మద్దతునిస్తుందని జిల్లా తూర్పు కన్వీనర్ సంజీవరావు తెలిపారు.
 ఆయన బుధవారం మేడ్చల్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం పోలవరంపై ఆర్డినెన్స్ జారీచేయడం తెలంగాణకు తీరని అన్యాయం చేయడమే అన్నారు. ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకపోతే మరోసారి ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు