జిల్లాలో భారీవర్షం

5 Jun, 2016 01:45 IST|Sakshi
జిల్లాలో భారీవర్షం

పలుచోట్ల ఈదురుగాలుల
బీభత్సం అలంపూర్‌లో అత్యధికంగా 8.8సెం.మీ
పొంగిపారిన వాగులు, వంకలు
కూలిన భారీవృక్షాలు, ఎగిరిపడ్డ ఇళ్లపైకప్పు రేకులు
 

సాక్షి, నెట్‌వర్క్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం రాత్రి, శనివారం భారీవర్షం కురిసింది. బలంగా వీచిన ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్లపైకప్పు రేకులు లేచిపోయాయి. చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా అలంపూర్, దేవరకద్ర, కొల్లాపూర్, గద్వాల, నారాయణపేట నియోజకవర్గాల్లో అధికవర్షపాతం నమోదైంది. అత్యధికంగా అలంపూర్‌లో 8.8సెం.మీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. అలంపూర్-అలంపూర్ చౌరస్తా ప్రధాన రహదారిలోని భైరాపురం స్టేజీ వద్ద ఉన్న వాగుపై వేసిన తాత్కాలికరోడ్డు వరదనీటికి కోతకు గురికావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు కర్నూలు జిల్లా తాండ్రపాడు మీదుగా అలంపూర్ చేరుకున్నారు. ఆర్టీసీ బస్సులూ ఇదే దారిలో వెళ్లాయి.

అలంపూర్ చౌరస్తా- అయిజ మధ్యలో ఉన్న కలుకుంట్ల, బొంకూరు, అయిజ పెద్దవాగు ఉప్పొంగడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. దేవరకద్ర మండలం గద్దెగూడెంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం వీచిన బలమైన గాలులు గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేశాయి. ఓ వైపు భారీవర్షం మరోవైపు బలమైన ఈదురుగాలులతో దాదాపు గంటపాటు ఏమవుతుందో అని గ్రామస్తులు ఊపిరిబిగపట్టుకుని కాలం గడిపారు. చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. గ్రామనడి బొడ్డున ఉన్న భారీ మర్రిచెట్టు నేలకూలింది. ఓ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయ.. ధరూరులో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కుండపోత కురిసింది.

భారీ ఉరుములు, మెరుపులతో గాలివాన కురిసింది. భారీవర్షానికి చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకున్నాయి. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణం వరదనీటితో చెరువును తలపించింది. పాన్‌గల్ మండలంలో కురిసిన భారీవర్షానికి మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువు, కుంటల్లోకి వర్షపునీరు చేరింది. కోయిల్‌కొండ మండలంలోని పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. మండలకేంద్రంలో ఓ రైతు వ్యవసాయ పొలంలో ఇంటి రేకులు గాలికి ఎగిరిపడ్డాయి.

>
మరిన్ని వార్తలు