పనితీరు మార్చుకోవాలి

16 May, 2015 04:17 IST|Sakshi

అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహంపనితీరు మార్చుకోవాలని సూచనసమావేశాలకు సమాచారం, అవగాహనతో రావాలి రారుతీ ట్రాక్టర్లపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం వాడీవేడీగా జెడ్పీ సర్వసభ్య సమావేశం జెడ్పీ సర్వసభ్య సమావేశం  గరం గరంగా సాగింది.. అధికారుల పనితీరుపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.. యూంత్రీకరణ అమలులో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని జెడ్పీటీసీలు మండిపడ్డారు.. కరువు, బ్యాంకు రుణాలు, పంట నష్టం అంచనాపై అధికారులను నిలదీశారు. హన్మకొండలోని జెడ్పీ సమావేశ మం దిరంలో  శుక్రవారం జెడ్పీ చైర్ పర్సన్ పద్మ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా వ్యవసాయం, నీటిపారుదల, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్ బీ, పీఆర్, విద్య, వైద్య ఆరోగ్య శాఖ, హరితహారంపై సమీక్షించారు.
- సమావేశాలకు పూర్తి సమాచారం, అవగాహనతో రావాలని అధికారులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశం
- రాయితీ ట్రాక్టర్లలో అవకతవకలపై కోర్టుకు వెళ్లేందుకైనా సిద్ధమన్న జెడ్పీ వైస్‌చైర్మన్ మురళీధర్
హన్మకొండ :
జిల్లాలోని అధికారుల పనితీరు సరిగా లేదని సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. సమావేశాలకు పూర్తి సమాచారంతో రాకపోవడంతోపాటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండలోని జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, పీఆర్, విద్య, వైద్య ఆరోగ్య శాఖలు, హరితాహారంపై సమీక్షించారు.
 వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో ఆ శాఖ ద్వారా అమలవుతున్న యాంత్రీకరణ అమలలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని, జెడ్పీటీసీ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు.

జిల్లాకు 135 ట్రాక్టర్లు రాయితీపై మంజూరైతే కనీసం ప్రచారం చేయడం లేదని, 135 ట్రాక్టర్లకు 135 దరఖాస్తులే వస్తాయా అని జెడ్పీ వైస్‌చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ నిలదీశారు. రైతులకు రాయితీపై ట్రాక్టర్లు ఇస్తున్నామని ఆ శాఖ అధికారులు కనీస సమాచారం ఇవ్వలేదని, ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీలో ఈ అంశాన్ని లేవనెత్తిపుడు సమాచారం అందించని ఏడీఏ, ఏఓల పై చర్య తీసుకుంటామని చెప్పారని, ఏ చర్య తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నర్సంపేటలో రాత్రికి రాత్రే దరఖాస్తు తీసుకుని ట్రాక్టర్ కేటాయించారన్నారు. రాయితీ ట్రాక్టర్లలో జరిగిన గోల్‌మాల్‌పై చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్లడానికైనా వెనుకాడనని హెచ్చరించారు. స్పందించిన కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ రాయితీ ట్రాక్టర్ల కేటాయింపుపై విచారణ జరిపించామని, ట్రాక్టర్లు తీసుకున్న రైతులంతా అర్హులేనని తేలిందన్నారు. దీంతో సంతృప్తి చెందని సభ్యులు పథకం అమలు తీరు సరిగా లేదన్నారు.

దీంతో కలెక్టర్ పూర్తి స్థాయి విచారణ జరిపిస్తానన్నారు. గణపుణం జెడ్పీటీసీ సభ్యుడు, టీడీపీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ శివశంకర్ మాట్లాడుతూ తమ మండలంలో రెండు ట్రాక్టర్లు కేటాయిస్తే ఇందులో అర్హులు ఎవరు లేరన్నారు. ఒకరైతే హన్మకొండలో నివాసముంటూ వ్యాపారం చేసుకుంటున్నారని, రైతు కాని వ్యాపారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మహబూబాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు, కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెంకన్న మాట్లాడుతూ రాయితీ యంత్రాలు రైతులకు చేరడం లేదన్నారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతున్న ఎందుకు జాప్యం జరుగుతుందని నిలదీశారు. స్పందించిన కలెక్టర్ కరుణ మాట్లాడుతూ బ్యాంకర్లతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు రుణాలివ్వాలని చెపుతున్నామన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పంటల అంచనా జరుగుతుందన్నారు. వారం రోజుల్లో పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి జేడీఏ గంగారాం మాట్లాడుతూ ఖరీఫ్‌లో ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి జరగాల్సిన రైతు చైత్యన యాత్రలు వాయిదా పడ్డాయన్నారు.

మిషన్ కాకతీయలో జరుగుతున్న చెరువుల పునరుద్ధరణ పనులు నాణ్యతగా ఉండేలా చూడాలని ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్ సూచించారు. శిఖం హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. చెరువులకు రివిట్‌మెంట్ ఉండేలా చూడాలని ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సూచించారు. చెరువులు పునరుద్ధరించగానే సరిపోదని జనగామ ప్రాంత చెరువులను గోదావరి జలాలతో నింపాలని, అప్పుడే సార్థకత ఉంటుందన్నారు. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి మాట్లాడుతూ చెరువుల ఎఫ్‌టీఎల్ హద్దులు ఎందుకు నిర్ణయించడం లేదని, దీంతో చెరువులు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. స్పందించిన కలెక్టర్ కరుణ సర్వేయర్ల కొరత ఉందని, థర్డ్ పార్టీ ద్వారా ఎఫ్‌టీఎల్ హద్దులు నిర్ణయించే పనిని చేపట్టనున్నట్లు చెప్పారు.

రెవెన్యూ, నీటిపారుదల అధికారులు సమన్వయంతో హద్దుల ఏర్పాటు జరుగుతందన్నారు. చెరువుల మరమ్మతు పనుల్లో అక్రమాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఏటూరునాగారం జెడ్పీటీసీ సభ్యురాలు వలియాబీ అన్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కరుణ చెప్పారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ మహిళలు బిందెలు పట్టుకుని రోడ్డెక్కకుండా ముందుగానే అన్నీ చర్యలను ప్రభుత్వం తీసుకుందన్నారు. నీటి ఎద్దడి నివారణకు నిధులు మంజూరు చేసిందన్నారు. ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే, పీఆర్ అధికారులు సరైన సమాచారంతో రాకపోవడంతో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. ఇక ముందు సమావేశాలకు వచ్చేటపుడు శాఖ, చేపట్టిన పనులపై అవగాహన ఏర్పరచుకుని రావాలన్నారు. సభ్యులు అడిగిన వెంటనే సమాధానం చెప్పాలని సూచించారు.

అధికారులు సక్రమంగా పని చేయాలని సూచి స్తున్నా.. అగ్రిమెంట్ సమయంలోనే పర్సంటేజీలు తీసుకుంటున్నారని సభ్యులు ఆరోపించారు. భీమారం, మడికొండ చెరువులను రిజర్వాయర్లుగా అభివృద్ది చేయాలని, తద్వారా నగర ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు దోహదపడుతాయని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ప్రాథమిక అరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని, కనీసం మండల ప్రజాపరిషత్ సమావేశాలకు కూడా రావడం లేదని సభ్యులు వైద్యాధికారులు తీరుపై మండిపడ్డారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ అధికారులు పని తీరు మెరుగుపరచుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు