డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై పోలీసుల ప్రత్యేక దృష్టి

20 Aug, 2019 10:01 IST|Sakshi
కొత్తగూడెంలో బ్రీత్‌ ఎనలైజర్‌తో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్ష చేస్తున్న దృశ్యం

సాక్షి, కొత్తగూడెం : మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి రోజూ జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విషయమై ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న భద్రాద్రి జిల్లాలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించే వారి విషయంలోనూ పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గత 11 నెలల్లో  జిల్లాలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు 1452 నమోదయ్యాయి. 2019 జనవరిలో 60 కేసులు, ఫిబ్రవరిలో 123, మార్చిలో 156, ఏప్రిల్‌లో 323, మేలో 215, జూన్‌లో 123, జూలైలో 164 కేసులు నమోదు చేశారు. 2018 సెప్టెంబర్‌లో 51 కేసులు, అక్టోబర్‌లో 89, నవంబర్‌లో 93, డిసెంబర్‌లో 54 కేసులు నమోదయ్యాయి. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెంది ఉండడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్నారు.

అలాగే వివిధ కాంట్రాక్ట్‌ కంపెనీల తరఫున ఇక్కడికి వచ్చి పనిచేసే వారూ ఎక్కువగానే ఉన్నారు. వీరితో పాటు ఇతరత్రా వివిధ వర్గాల వారు సైతం మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతో జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గత ఏప్రిల్‌ వరకు ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదు కాగా, తరువాత కొంతమేరకు తగ్గుతూ వచ్చాయి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తగ్గించేందుకు మరిన్ని డ్రైవ్‌లు చేపట్టేలా పోలీసు యంత్రాంగం ముందుకు సాగుతోంది. ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమిస్తే వేస్తున్న జరిమానాలను భారీగా పెంచేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల చట్టం సవరించినట్లు వార్తలు వచ్చాయి. త్వరలో పెంచిన జరిమానాలను అమలు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. 

మద్యం సేవించి వాహనాలు నడపొద్దు 
వాహనాలు నడిపేవారు మద్యం సేవించకుండా ఉండాలి. మద్యం తాగి వాహనాలు నడిపితే వారితో పాటు ప్రయాణం చేసేవారు,  రోడ్డుపై వెళుతున్న పాదచారులు, ఇతర వాహనదారులు సైతం ప్రమాదాల బారిన పడతారు. అమూల్యమైన జీవితాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. సదరు వాహనచోదకులపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యులు దిక్కులేనివారు అవుతారు. అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. ద్విచక్ర వాహన దారులు హెల్మెట్‌ ధరించడం ఎంత ముఖ్యమో, మద్యం సేవించకుండా ఉండడం అంతే ముఖ్యం. పెద్ద వాహనాలు నడిపేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి.  ట్రాఫిక్‌ నిబంధనల అతిక్రమణ, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ అంశాలపై మరింత దృష్టి సారించి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాం.  – సునీల్‌దత్, ఎస్పీ  

మరిన్ని వార్తలు