జిల్లాలో వాటర్ గ్రిడ్‌కు రూ.280 కోట్లు

16 Feb, 2015 05:36 IST|Sakshi

జోగిపేట/పుల్‌కల్: జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలనే ఉద్దేశంతో రూ.280 కోట్ల వ్యయంతో వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి పుల్‌కల్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా సింగూర్ ప్రాజెక్ట్ లోపల కుడి, ఎడమ వైపులా నిర్మించ తలపెట్టిన ఇన్‌టెక్‌వెల్ (వాటర్ గ్రిడ్ పంపింగ్) నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.

ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయ్‌కుమార్ ద్వారా ప్రాజెక్ట్ వివరాలను తెలుసుకున్నారు. ఎడమ వైపు నిర్మించే ఇన్‌టెక్ వెల్ నుంచి అందోల్, మెదక్, రామాయంపేట, నారాయణఖేడ్ నియోజక వర్గాల్లోని గ్రామాలకు మంచి నీటిని సరఫరా చేస్తామని, ఇన్‌టెక్ వెల్  నుంచి ప్రాజెక్ట్ లోపలి భాగం వరకు సుమారు కిలోమీటరున్నర పొడవున ఫీడర్ చానల్ కాలువ ద్వారా నీటిని తరలించడం జరుగుతుందని ఎస్‌ఈ మంత్రి కేటీఆర్‌కు వివరించారు. వేసవి సమీపిస్తున్నందున ఫిల్టర్ బెడ్‌కు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి జిల్లా అధికారులను ఆదేశించారు.
 
ప్రాజెక్ట్ కుడి వైపున మునిపల్లి, బుసారెడ్డిపల్లి గ్రామాల శివారులోని మంజీర నదిలో నిర్మించనున్న ఇన్‌టెక్ వెల్ నుంచి సంగారెడ్డి, పటాన్‌చెరు, జహీరాబాద్ నియోజకవర్గాలకు తాగునీటిని అందిస్తామన్నారు. ఇక్కడ భూ సేకరణ సమస్య లేనందున గ్రిడ్ పనులను వేగవంతంగా చేయాలన్నారు. సింగూర్ ప్రాజెక్టు వద్ద రెండు ఇన్‌టెక్ వెల్స్, ఫిల్టర్ బెడ్ల పనులను వచ్చే నెల మొదటి వారంలోగా ప్రారంభించాలని ఆదేశించారు.

గజ్వేల్‌తోపాటు, సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వాటర్‌గ్రిడ్‌లో మంజీర నీటి పథకాన్ని విలీనం చేసి, నర్సాపూర్ నియోజక వర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎమ్మెల్యేలు బాబూమోహన్, చింతా ప్రభాకర్, కలెక్టర్ రాహుల్ బొజ్జా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
 
బుస్సారెడ్డిపల్లిలో స్థలపరిశీలన

మునిపల్లి: పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఆదివారం మునిపల్లి మండలం బుస్సారెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామ శివారులో నిర్మించనున్న ఇన్‌టెక్ వెల్స్ స్థలాన్ని పరిశీలించారు. మండలంలోని బుదేరా గ్రామ శివారులో 60 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకు ఏర్పాటు చేస్తామని మంత్రులు తెలిపారు. వారి వెంట ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ రాహుల్‌బొజ్జా తదితరులున్నారు.

మరిన్ని వార్తలు