జిల్లాకు మరో ఎమ్మెల్సీ స్థానం?

25 Apr, 2015 00:49 IST|Sakshi

- తెలంగాణకు పెరిగిన మూడు మండలి సీట్లు
- స్థానాల పునర్విభజనకు ఈసీ కసరత్తు
- స్థానిక సంస్థల కోటాలో మరో స్థానం లభించే ఛాన్స్
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి:
జిల్లాకు మరో ఎమ్మెల్సీ స్థానం రానుంది. స్థానిక సంస్థల కోటాలో అదనపు సీటు లభించే అవకాశం ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు శాసన మండలి స్థానాల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రచురించడంతో త్వరలోనే ఈ సీటుపై స్పష్టత రానుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలను 14కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ సంఖ్యకు అనుగుణంగా మండలి సీట్ల పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.

ఈ నేపథ్యంలో కొంతకాలంగా ఎమ్మెల్సీ స్థానాల పెంపుపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. స్థానిక సంస్థల ప్రతినిధుల సంఖ్యకు అనుగుణంగా నియోజకవర్గాన్ని డీలిమిటేషన్‌ను చేయనున్నారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు సహా దాదాపు వేయి మంది ప్రజాప్రతినిధులున్నారు. దీనికితోడు జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 48 డివిజన్లు మన జిల్లా పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం వీటి కాలపరిమితి ముగిసింది. త్వరలోనే వీటికి అదనంగా మరో 50 డివిజన్లు శివార్లలోనే ఏర్పడుతున్నాయి.

వీటన్నింటినీ గమనంలోకి తీసుకుంటే జిల్లాకు అదనంగా మరో ఎమ్మెల్సీ స్థానం రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్నం నరేందర్‌రెడ్డి పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అతిత్వరలోనే దీనికి ఎన్నికల షెడ్యూల్ వెలువడే ఛాన్స్ ఉంది.  ఈ క్రమంలో ఈ ఎన్నికను కూడా పునర్విభజన అనంతరం పెరిగే సీట్లతో చేస్తారా? గడువులోపు చేస్తారా? అనే అంశంపై ఎన్నికల కమిషన్ స్పష్టీకరించడంలేదు. కేంద్ర ప్రభుత్వం గురువారమే గెజిట్ ప్రకటించినందున.. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పరిశీలించిన తర్వాతే దీనిపై క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, లోకల్‌బాడీ కోటాలో రెండు సీట్లు వస్తాయని గత కొంతకాలంగా భావిస్తున్న ఆశావహులు.. సీట్ల సంఖ్యపై మల్లగుల్లాలు పడుతున్నారు. బల్దియా పాలకవర్గం పదవీకాలం ముగియడంతో 48 డివిజన్లు ఖాళీగా ఉన్నందున ఇప్పట్లో స్థానిక సంస్థల కోటా ఎన్నికలు జరిగే అవకాశంలేదని కొందరు అంటున్నారు. అయితే, మొత్తం సీట్లలో 50శాతం సీట్లు తక్కువగా ఉంటే మాత్రమే ఎన్నిక వాయిదా పడుతుందని, ఇక్కడ మాత్రం ఆ పరిస్థితిలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ స్థానాల పెంపుపై సీఈసీ కసరత్తు ప్రారంభిస్తున్నందున సరికొత్త ప్రచారానికి తెరలేచింది. సీట్ల పునర్విభజన పూర్తయితే తప్ప ఎన్నికలుండవనే వాదన తెరపైకి వస్తోంది.

>
మరిన్ని వార్తలు