బొమ్మలు మాట్లాడతాయ్...

16 Oct, 2014 06:18 IST|Sakshi
బొమ్మలు మాట్లాడతాయ్...

వెంట్రిలాక్విజమ్‌లో దిట్ట పరమేశ్వర్
హైదరాబాద్: జీవంలేని బొమ్మలు మాట్లాడుతాయ్.. ప్రముఖులను అనుకరిస్తాయ్.. ప్రేక్షకులను మైమరపిస్తాయి..ఇదో అద్భుత కళ.. దానిని ఔపోసాన పట్టాడు.. దానినే వృత్తిగా ఎంచుకున్నాడు.. నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు పరమేశ్వర్. వెంట్రిలాక్విజమ్(బొమ్మలతో మాట్లాడించే కళ) పరమేశ్వర్‌గా పేరొందాడు. నగరానికి చెందిన పరమేశ్వర్ తొలుత మిమిక్రీ నేర్చుకున్నాడు. తర్వాత వెంట్రిలాక్విజమ్‌ను నేర్చుకున్నాడు. బొమ్మలతో మాట్లాడించడం అంత సులభమేమీ కాదు.. ప్రేక్షకులను మెప్పించడం కూడా ఎంతో కష్టం.. కళ్లకు కనిపించకుండా మాట్లాడుతూ హావ భావాలను పలికించాలి..దీనిలో ఆరితేరాడు.

వృత్తిగా ఎంచుకున్నాడు. అంతర్జాతీయంగా పేరుతెచ్చుకున్నాడు. ఎంతో మంది కళాకారులకు ఈ కళలో శిక్షణ ఇస్తున్నారు. నలభై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అంతర్జాతీయ స్థాయి వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో బొమ్మతో వేలాది ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రభుత్వ కార్యక్రమమైనా, ప్రయివేటు కార్యక్రమమైనా పరమేశ్వర్ ప్రదర్శన ఉండాల్సిందే. పరమేశ్వర్ మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్‌లో ఎన్నో మైలురాళ్లు దాటాడు. ధ్వని అనుకరణ కళా ప్రపూర్ణ, మిమిక్రీ వెంట్రిలాక్విజమ్ యువ సమ్రాట్ వంటి అవార్డులు అందుకున్నాడు.

1991లో నంది అవార్డుల ప్రదానోత్స వంలో ప్రదర్శన ఇచ్చారు. అనేక సినిమాల్లో మిమిక్రీ ఆర్టిస్టుగా పనిచేశాడు. 1996లో తెలుగు లలిత కళాతోరణంలో నాలుగు రోజుల పాటు జరిగిన ప్రపంచ మహా సభలు, 2013 తిరుపతిలో జరిగిన తెలుగు ప్రపంచ మహా సభల్లో సైతం ప్రదర్శనలు ఇచ్చి అందరి మెప్పు పొందాడు. జీవితంలో మిమిక్రీ కళను ప్రోత్సహించడానికి ప్రత్యేక సంస్థను నెలకొల్పి తద్వారా ఎంతో మంది కళాకారులను తయారు చేయడమే తన ముందున్న లక్ష్యమని పరమేశ్వర్ అన్నాడు.

>
మరిన్ని వార్తలు