సైన్స్‌నూ విభజిస్తారా?

14 Nov, 2014 01:23 IST|Sakshi
సైన్స్‌నూ విభజిస్తారా?
  • ఏపీ అకాడమీ ఆఫ్ సెన్సైస్ విభజన సరికాదు
  •  గవర్నర్ నరసింహన్ అసంతృప్తి
  •  విభజన గాయాల తీవ్రతను  రోజూ చూస్తున్నా
  •  సైన్స్‌కు హద్దులు ఉండరాదు...
  •  స్వర్ణోత్సవాలు ఘనంగా ప్రారంభం
  • సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సెన్సైస్‌ను రెండుగా విడగొట్టడంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సైన్స్‌కు ఎల్లలు లేవు, ఉండరాదని వ్యాఖ్యానించారు. విభజన తాలూకు  గాయాలు ఎంత లోతుగా ఉంటాయో తాను ప్రతిరోజూ చూస్తున్నానని చెప్పారు. ఆంధప్రదేశ్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ స్వర్ణోత్సవాలను గవర్నర్ గురువారం ప్రారంభించి మాట్లాడారు. విభజన గాయాలు మానేందుకు ఎంతో సమయం పడుతుందన్నారు. శాస్త్ర పరిశోధనల విషయంలో జాప్యం జరిగేందుకు వీలు లేదన్నది తన నిశ్చితాభిప్రాయమన్నారు.

    ఒకవేళ ఇప్పుడు ఉన్న పేరుతో ఏవైనా చిక్కులొస్తాయని భావిస్తే ‘అకాడమీ ఆఫ్ సెన్సైస్’గా మార్చి ఉండాల్సిందన్నారు. తగిన ప్రణాళికలు సమర్పించి నిధులు కేటాయించాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఉద్దండ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో మొదలైన ఈ సంస్థ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టటం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. పిల్లల్లో శాస్త్ర అంశాలపై ఆసక్తి పెంచేందుకు పూర్తిగా సౌరశక్తితో నడిచే పార్కు ఏర్పాటును పరిశీలించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ఈ పార్క్‌లో ప్రయోగాలు చేసేందుకు పిల్లలకు అవకాశం కల్పించాలన్నారు.
     
    గుండె గుభేల్‌మనేలా వైద్య బిల్లులు..

    భారత శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయాలు నిరుపమానమైనవని, అయితే ఓ సామాన్యుడిగా వారి నుంచి మరింత ఆశిస్తున్నానని గవర్నర్ పేర్కొన్నారు. అందరికీ ఆహారం, ఇంధన భద్రత, వైద్యం, వైద్యవిద్య చౌకగా అందించటం, వీటన్నింటికీ మించి జాతీయ భద్రతపై అంకితభావంతో కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం వైద్యం చాలా ఖరీదైపోయిందని, సామాన్యుడు వ్యాధితో కాకుండా ఆసుపత్రి బిల్లు చూసి మరణించే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

    కొత్త వైద్యకళాశాలలు పుట్టుకొస్తున్నా సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వైద్యవిద్యలో డొనేషన్లు లేకుండా చూడాలని, దీన్ని ఉల్లంఘిస్తే శిక్షించేలా నిబంధనలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్ పట్టభద్రులు తగినంత నైపుణ్యాలు లేక కానిస్టేబుళ్లుగా, ప్యూన్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఈ పరిస్థితిని మార్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని ప్రభుత్వాలను కోరారు.  
     
    కలసి పనిచేస్తే విజయాలు: కటోచ్

    శాస్త్ర, పరిశోధన రంగాల్లో ఎన్ని గొప్ప విజయాలు సాధించినా అంతర్జాతీయ స్థాయిలో మన ముద్ర లేకపోవటానికి ఒక సమస్య పరిష్కారానికి సంబంధిత రంగాల వారంతా కలసికట్టుగా ప్రయత్నించకపోవడమే కారణమని భారత వైద్య పరిశోధన సమాఖ్య డెరైక్టర్ విశ్వమోహన్ కటోచ్ పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు రావటంతో సత్ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. మెదడువాపు వ్యాధి చికిత్సతోపాటు నీటిశుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు వరకూ అనేక అంశాల్లో ఏడు కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. కాన్పూర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కుగ్రామంలో ఐదేళ్ల సంయుక్త కృషితో క్షయ, కుష్టు వ్యాధులను గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు.
     
    ఉద్దండ శాస్త్రవేత్తలకు సత్కారం

    ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ సీనియర్ శాస్త్రవేత్తలను ఘనంగా సత్కరించారు. సంస్థ వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ పి.ఎం.భార్గవ, ఎం.కృష్ణమూర్తిలను గవర్నర్ సత్కరించారు. వయోభారం వల్ల వీరిద్దరూ స్టేజిపైకి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన గవర్నర్ స్వయంగా కిందకు దిగి వారిని సత్కరించారు.  డాక్టర్ విశ్వమోహన్ కటోచ్, ఏ.వి.రామారావులను జీవితకాల సాఫల్య పురస్కారాలతో గౌరవించారు. సంస్థ మాజీ అధ్యక్షులను కూడా ఘనంగా సన్మానించారు. వై.నాయుడమ్మ స్మారక అవార్డును ఎల్‌వీ ప్రసాద్ నేత్ర పరిశోధన విభాగం అధ్యక్షుడు డాక్టర్ బాలసుబ్రమణ్యం అందుకున్నారు.
     

మరిన్ని వార్తలు