ఉపాధి హామీలో  వేతన ‘విభజన’

2 Mar, 2020 02:54 IST|Sakshi

పనితీరు ఆధారంగానే ఫీల్డ్‌

అసిస్టెంట్ల కాంట్రాక్టు రెన్యువల్, జీతాల చెల్లింపు

ఈనెల 14లోపు ప్రక్రియ పూర్తి చేయాలని డీవోఆర్‌డీ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పని కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొం టున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లను దారి లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లకు నిర్దేశించిన నెలకు రూ.10 వేల వేతనాన్ని పనితీరు ఆధారంగా విభజించనుంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్లకు కేటాయించిన పంచాయతీల్లోని జాబ్‌కార్డుదారులకు కల్పించే పనిదినాల ఆధారంగా వారిని విభజించాలని, మరీ తక్కువ పని దినాలు కల్పించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను వెంటనే తొలగించాలని, ఫీల్డ్‌ అసిస్టెంట్ల కేటగిరైజేషన్‌తో పాటు తొలగింపు ప్రక్రియను ఈనెల 14కల్లా పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. 

మూడు కేటగిరీలుగా విభజన..
ఇప్పటివరకు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి నెలకు రూ.10 వేల వేతనం ఇస్తున్నారు. ప్రతి యేటా జూలై 1 నుంచి వచ్చే ఏడాది జూన్‌ 30 వరకు వారిని రెన్యువల్‌ చేస్తుంటారు. వీరు ఈ పథకం కింద వారికి కేటాయించిన పంచాయతీల్లోని జాబ్‌కార్డు దారులందరికీ పనిదినాలు కల్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ పనిదినాల కల్పన ఆధారంగానే ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఇప్పుడు ప్రభుత్వం విభజిస్తోంది. పంచాయతీలోని జాబ్‌కార్డు ఉన్న వారికి కనీసం 30 అంతకన్నా ఎక్కువ పనిదినాలు కల్పించిన వారిని కేటగిరీ–1లో పెట్టి వారికి గతంలో ఇస్తున్న విధంగానే నెలకు రూ.8,900 వేతనం, రూ.1,100 అలయెన్సులు కలిపి రూ.10 వేలు చెల్లించనుంది.

కేటగిరీ–1..
జాబ్‌కార్డుదారులకు కనీసం 30 అంతకన్నా ఎక్కువ పనిదినాలు కల్పించిన వారికి రూ.10 వేలు చెల్లించనుంది. వీరి కాంట్రాక్టును రెన్యువల్‌ చేయనుంది. 

కేటగిరీ–2ఏ..
29–20 రోజుల పని దినాలు కల్పించగలిగిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఈ కేట గిరీలో ఉంచి వారి రెన్యువల్‌ను పెండింగ్‌లో పెట్ట నున్నారు. వేతనం నెలకు రూ.9వేలకు పరిమితం చేయనున్నారు. 

కేటగిరీ–2బీ..
నెలకు 19–10 పని దినాలు కల్పించగలిగిన వారిని ఈ కేటగిరీలో పెట్టి వారి కాంట్రాక్టును కూడా రెన్యువల్‌ చేయరు. వారి వేతనాన్ని రూ.7,500గా నిర్ధారించనున్నారు.  

వీరి కాంట్రాక్టును గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు రెన్యువల్‌ కూడా చేయనుంది. ఇక, 29–20 రోజుల పనిదినాలు కల్పించగలిగిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను కేటగిరీ–2ఏలో ఉంచి వారి రెన్యువల్‌ను పెండింగ్‌లో పెట్టాలని, వారి వేతనాన్ని నెలకు రూ.9వేలకు పరిమితం చేయనున్నారు. అలాగే నెలకు 19–10 పనిదినాలు కల్పించగలిగిన వారిని కేటగిరీ–2బీలో పెట్టి వారి కాంట్రాక్టును కూడా రెన్యువల్‌ చేయవద్దని, వారి వేతనాన్ని రూ.7,500గా నిర్ధారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక, సగటున కనీసం 10 పనిదినాలు కూడా కల్పించలేని వారిని వెంటనే తొలగించాలని, ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ పనిదినాల కల్పన పనితీరును 2018, జూలై 1 నుంచి 2019 జూన్‌ 30 మధ్య పరిగణనలోకి తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఫీల్డ్‌ అసిస్టెంట్ల అసంతృప్తి..
ప్రభుత్వ నిర్ణయంపై ఫీల్డ్‌ అసిస్టెంట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి పనుల కల్పన విషయంలో పంచాయతీల వారీగా వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు. చిన్న పంచాయతీల్లో 50ఐ100 కార్డులు మాత్రమే ఉంటాయని, ఆయా కుటుంబాలకు సగటున ఏటా 30 పనిదినాల కల్పన అంత కష్టమేమీ కాదంటున్నారు. అలాగే 1000 జాబ్‌కార్డులున్న గ్రామాలు, వాటి హ్యామ్లెట్లలోని అన్ని కుటుంబాలకు సగటున 30 పనిదినాలు కల్పించడం అంత సులువైన కాదని చెబుతున్నారు.

గత 14ఏళ్లుగా గ్రామాల్లో చాలా చేశామని, ఇప్పుడు కొత్తగా చేయడానికి పనులు కూడా లేవని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో 30 పనిదినాల ప్రాతిపదికన తమను విభజించడం సరైంది కాదని తెలంగాణ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముదిగొండ శ్యామలయ్య వ్యాఖ్యానించారు. ఈ సర్క్యులర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఇప్పటికే సమ్మెకు నోటీసు ఇచ్చామని, సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల ముట్టడి ఉందని, 11న చలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపడతామని, అప్పటికీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను రద్దు చేయకపోతే ఈనెల 12 నుంచి విధులు బహిష్కరించి పూర్తిస్థాయి సమ్మెకు దిగిపోతామని హెచ్చరించారు. 

ఫీల్డ్‌ అసిస్టెంట్లపై వస్తున్న విమర్శలివే... 
గత 14 ఏళ్లుగా గ్రామాల్లో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల పనితీరు విమర్శలకు కారణమవుతోంది. ప్రభుత్వం ఇచ్చే వేతనానికి తోడు కొన్ని నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా సంపాదిస్తున్నారని, పని దినాల కల్పనలో పేదలను తమ ఇళ్ల చుట్టూ తిప్పించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సొంత పనులు చక్కబెట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, తమకు అనుకూలంగా ఉన్న వారికి, సన్నిహితులు, బంధువులకు పని కల్పించేలా వారి పేర్లను మస్టర్లలో రాస్తున్నారని, కొన్ని చోట్ల పని చేయకుండానే మస్టర్లను రాస్తున్నారని ప్రభుత్వం నిర్ధారించింది. ముఖ్యంగా గ్రామాల్లోని పేదలను, రాజకీయ నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆయా గ్రామాలను ఓ రకంగా శాసించే స్థాయికి కొందరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు చేరిపోయారనే తీవ్ర ఆరోపణలు కూడా వారిపై ఉన్నాయి.

 

మరిన్ని వార్తలు