‘గ్రేట్’ మార్పు!

21 Jun, 2015 00:37 IST|Sakshi
‘గ్రేట్’ మార్పు!

- నగరంలో పెరగనున్న జోన్లు
- సీఎం నోట కొత్త మాట
- జీహెచ్‌ఎంసీ పరిధిలోకి అర్బన్ హెల్త్ సెంటర్లు
- రూ.42 వేల కోట్లతో సౌకర్యాలు
సాక్షి, సిటీబ్యూరో:
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓ వైపు డివిజన్ల విభజనకు చురుగ్గా సన్నాహాలు సాగుతున్నాయి. మరోవైపు జోన్ల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ స్వయంగా తన మనసులోని మాటను బయట పెట్టారు. గ్రేటర్‌లోని ప్రజా ప్రతినిధులతో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో ‘స్వచ్ఛ హైదరాబాద్’పై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నగరంలో ప్రస్తుతం ఐదు జోన్లు ఉన్నాయని... ఈ సంఖ్యను పెంచాలని... అవసరమైన మేరకు అదనపు సిబ్బందిని నియమించాలని అధికారులకు సూచించారు. సఫాయి కర్మచారుల వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే మెట్రో రైలును ఔటర్ రింగ్‌రోడ్డు వరకూ పొడిగిస్తామన్నారు.

ప్రజావసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తామని, నగర రూపురేఖలు మారుస్తామని చెప్పారు. గ్రేటర్ ప్రజల కోసం మోడల్ మార్కెట్లు, మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల వంటివి ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనికి రూ.42వేల కోట్లు ఖర్చు కానుందని చెప్పారు. దశల వారీగా ఈ పనులు చేస్తామన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అర్బన్ హెల్త్‌సెంటర్లను జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ఆదేశించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. నగరంలోని 77 నాలాలు, మురికికాల్వల నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు అందించేందుకు ఏం చేయాలనే అంశంపై ప్రజాప్రతినిధులతో కమిటీని నియమించాలని సీఎం సూచించారు. గ్రేటర్‌లో చెత్త సేకరణను జీహెచ్‌ఎంసీయేనిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఢిల్లీ, నాగ్‌పూర్‌లలోని పరిస్థితులను ఎమ్మెల్సీ జాఫ్రి, ఎమ్మెల్యే లక్ష్మణ్ వివరించారు. రెండు నగరాల్లో చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతులను తెలియజేశారు. ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులతో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్  కుమార్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోకి అర్బన్ హెల్త్ సెంటర్లు
ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్బన్ హెల్త్‌సెంటర్లు ఇక జీహెచ్‌ఎంసీపరిధిలోకి రానున్నాయి. గ్రేటర్‌లో 85 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. 1994 నుంచి 2001 వరకు ఇవి అప్పటి ఎంసీహెచ్ ఆధ్వర్యంలో పనిచేశాయి. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి వెళ్లాయి. వాటిలోని 48 సెంటర్లు డీఎంఓహెచ్‌కు బదలాయించారు. అయినప్పటికీ ఆ భవనాలకు నీరు, విద్యుత్, టెలిఫోన్ బిల్లుల చెల్లింపుతో పాటు ఆగాపురా, బాలాగంజ్, బేగంబజార్, దారుల్‌షిఫా, చార్మినార్, గగన్‌మహల్, హర్రాజ్‌పెంట, కార్వాన్, న్యూబోయిగూడ, పాన్‌బజార్, పురానాపూల్, యాకుత్‌పురా, బొగ్గులకుంట తదితర కేంద్రాల్లోని వైద్యుల జీతభత్యాలను జీహెచ్‌ఎంసీయే చెల్లిస్తోంది.

హెచ్‌ఓడీల పర్యవేక్షణ లేకుండా జీహెచ్‌ఎంసీ నుంచి జీతాలు వెళ్లడం ఆరోపణలకు తావిచ్చింది. మరోవైపు నగరంలో ఆరోగ్యం-పారిశుద్ధ్యం నిర్వహణ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలకు .. ముఖ్యంగా పేదబస్తీల్లోని వారికి వైద్య సేవలందించేందుకు వాటి నిర్వహణ కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉండాలని గతంలో స్టాండింగ్ కమిటీ, సర్వసభ్య సమావేశాల్లోనూ ప్రస్తావించారు. తద్వారా ఆరోగ్యం-పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహనతోపాటు బస్తీల్లో వైద్య శిబిరాల నిర్వహణకూ వీలుంటుందని భావించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఈ అంశాలపై దృష్టి సారించారు. నిధులిచ్చేదొకరు.. పర్యవేక్షణ మరొకరి పరిధిలో ఉండటంతో ప్రజలకు సేవలందడం లేదు. అన్నిటినీ ప్రభుత్వానికి వివరించడంతో...ఆర్బన్ హెల్త్ సెంటర్లను జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తీసుకు రావాలని సీఎం నిర్ణయించారు.
 
ఇదీ ప్రతినిథుల మాట
బంజారాహిల్స్: స్వచ్ఛ హైదరాబాద్‌పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు నగర అభివృద్ధికి సలహాలు, సూచనలిచ్చారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు...
 
తేడాలొస్తే వ్యతిరేకిస్తాం
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన ఈ ప్రణాళిక చాలా బాగుందని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. ఇదొక మంచి కార్యక్రమమని... పార్టీలకు అతీతంగా అందరూ తమ సూచనలు చేశారని తెలిపారు. అభివృద్ధిలో ఏమైనా తేడాలొస్తే వ్యతిరేకిస్తామన్నారు.
 
పరిష్కారానికి అవకాశం
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ఈ సమావేశం ఎంతో ఉపయోగకరంగా ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మూసీని శుభ్రం చేయాలని సూచించినట్లు చెప్పారు. నగర సమస్యలకు సంబంధించిన బాధ్యతలు ఎమ్మెల్యేలకు అప్పగించడం వల్ల పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఒక్కో సమస్యపై ఒకటి చొప్పున తొమ్మిది సబ్ కమిటీలు వేశారని... ఈ ప్లానింగ్ బాగుందని అన్నారు. వీటిఅమలుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
 
చాయ్.. బిస్కెట్ సమావేశం
ఇది చాయ్, బిస్కెట్ సమావేశంలా ఉందని... నియోజకవర్గాలకు పైసా కూడా విదల్చకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ (టీడీపీ) ప్రశ్నించారు. కమిటీల వల్ల ఇంతవరకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆరోపించారు. టైం పాస్ సమావేశాల వల్ల ఉపయోగం లేదన్నారు.
 
పారదర్శకత అవసరం
ఒక్కో నియోజకవర్గానికి వేయి చొప్పున డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని కోరినట్టు ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ (బీజేపీ) తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఇళ్ల నిర్మాణంలో పాదర్శకత ఉండాలని కోరినట్లు చెప్పారు. శివారు ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారానికి కొత్త పైప్‌లైన్లు వేయాలని సూచించామన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా తీసుకునే నిర్ణయాలు బాగున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా మిషన్ ‘కాకతీయ’ ద్వారా చెరువులను సుందరీకరిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పామన్నారు.
 
తప్పుల మీద తప్పులు
చంద్రబాబుకు మతి భ్రమించిందని టీఆర్‌ఎస్ ఎంపీ వేణుగోపాలాచారి ఆరోపించారు. నోటుకు ఓటు కుంభకోణంలో పీకల దాకా కూరుకుపోయిన చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తూ లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. టేపుల్లోని వాయిస్ తనదా కాదా అన్నది చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
 
వార్డులతో పాటే జోన్లు?
నగరంలోని జోన్లను పెంచనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంతో... అందుకు అనుగుణంగా సర్కిళ్లు కూడా పెరిగే వీలుంది. ప్రస్తుతం గ్రేటర్‌లో 18 సర్కిళ్లు ఉన్నాయి. వాటిని 30కి పెంచాలని ప్రసాదరావు కమిటీ సిఫారసు చేసింది. జోన్లలోని సర్కిళ్ల సంఖ్యలోనూ ప్రస్తుతం వ్యత్యాసాలు ఉన్నాయి. జోన్లను పెంచితే ఈ దిశగా కూడా మార్పులు తప్పవు. కమిటీ సిఫార్సుల మేరకు పలు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. రెండు దశల్లో 2,607 పోస్టుల భర్తీకి గతంలో ఉమ్మడి రాష్టంలోనే నిర్ణయం తీసుకున్నారు. అవసరమైనంత సిబ్బందిని నియమిస్తామని తాజాగా సీఎం కూడా ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా... ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో సీఎం నోట జోన్ల పెంపు మాట చర్చనీయాంశంగా మారింది. వార్డులతో పాటే వీటిని పెంచుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
నీటి సరఫరాకు ప్రణాళిక
గ్రేటర్ పరిధిలో చెత్తను తరలించడానికి 2500 ఆటోలు, వేయి రిక్షాలు కొనాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్‌తో సహా పెరిగిన జనాభాకు అనుగుణంగా మంచినీటి సరఫరా పెంచాలని నిర్ణయించామన్నారు. నగరానికి 723 ఎంఎల్‌డీ నీళ్లు అవసరమని...దీనికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రాబోయే కాలంలో హైదరాబాద్‌ను దేశంలో నెం-1సిటీగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. హెచ్‌ఎండీఏలో ప్రక్షాళన జరుగుతోందన్నారు. టీ న్యూస్‌కు ఆంధ్రా పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని ఆయన ఖండించారు.

మరిన్ని వార్తలు