ఆటాడితే వేటాడతాయ్‌!

24 Sep, 2018 08:09 IST|Sakshi

వ్యసనమైన మొబైల్‌ యాప్‌ గేమ్స్‌

కుటుంబాలు, యువత, పిల్లలపై తీవ్ర ప్రభావం   

ఈ ‘ఆట’లకు దూరంగా ఉండాలని నిపుణుల సూచన    

వీటి ద్వారా లాభాల కంటే నష్టాలే ఎక్కువ

జీవితమే ఒక క్రీడా మైదానం. మనమంతా ఆటగాళ్లం. ఈ క్రీడలో తప్పక ఆడాల్సిందే. అలాంటిది కొన్ని ‘గేమ్స్‌’ మనల్ని ఆడిస్తున్నాయి. జీవితాల్ని చిత్తు చేస్తున్నాయి. కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. పిల్లల చదువులను, యువత కెరీర్‌నూ పాడు చేస్తున్నాయి. మొబైల్‌ వీడియో గేమ్స్‌ అన్ని వర్గాలపై పెను ప్రభావమే చూపుతున్నాయి. ఆటాడుకుందాం రా.. అని వేటాడుతున్నాయి. మొబైల్‌లో ఇటీవల కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘ఫోర్ట్‌నైట్‌’ గేమ్‌ ఆడటం వ్యసనంగా మారడంతో యూకేలో విడాకుల సంఖ్య పెరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నగరవాసులూ మొబైల్‌ వీడియో గేమ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.       

కలెక్టరేట్‌ :ఇటీవల మొబైల్‌ యాప్‌లలో అందుబాటులోకి వస్తున్న సరికొత్త వీడియో గేమ్స్‌ యువతను, పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వారికి నూతన  ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి. ఇదంతా నాణేనికి వైపు మాత్రమే. వీటి వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా జరుగుతున్నాయనే విషయం నాణేనికి మరోవైపు కనిపిస్తున్న యథార్థం. వింత వింత  వీడియో గేమ్స్‌కు అతుక్కుపోతుండటం, గంటలకొద్దీ సమయం వృథా చేస్తుండటంతో పిల్లలు చదువులను అశ్రద్ధ చేస్తున్నారు. యువత తమ కెరీర్‌పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. అలాగే కుటుంబాలపైనా పెను ప్రభావమే చూపుతోంది. ఈ గేమ్‌ ఆడటం వ్యసనంగా మారడటంతో జీవనశైలి మార్పులకు లోనవుతోంది. ఉద్యోగులు మానసిక ఒత్తిడిని జయించే క్రమంలో గేమ్స్‌కు అడిక్ట్‌ అవుతున్నారు. దంపతులు తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తుండటంతో కలహాల కాపురాలుగా మారుతున్నాయి. భర్త/భార్య మొబైల్‌తో ఎక్కువ సేపు గడుపుతుండటంతో సమస్య తీవ్రత పెచ్చుమీరుతోంది.   

పెరుగుతున్న విడాకుల సంఖ్య..
ప్రస్తుతం మహిళల నుంచి వస్తున్న అధిక ఫిర్యాదుల్లో తమ భర్త ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌కే  కేటాయిస్తున్నాడని, తమను అసలు పట్టించుకోవడంలేదని. ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్న బ్యాటిల్‌ రాయల్‌ గేమ్‌ ‘ఫోర్ట్‌నైట్‌’ కుటుంబాల మధ్య పెద్ద చిచ్చే పెడుతోంది. యూకేకు చెందిన ప్రముఖ వెబ్‌సైట్‌ డైవోర్స్‌ ఆన్‌లైన్‌ 2018కిగానూ ఇప్పటి వరకు 4,665 డైవోర్స్‌ పిటిషన్‌ రిక్వెస్ట్‌లు అందగా వాటిలో 200 వరకు ఫోర్ట్‌నైట్‌ ఇంకా ఇతర ఆన్‌లైన్‌ గేమ్స్‌ కారణంగానే విడాకులు కోరుకుంటున్నట్లు వెల్లడి కావడం విస్తుగొలుపుతోంది.   

ప్రమాదకరమని తెలిసినా..  
కోట్లాది మంది యూజర్లతో ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌ ప్రపంచాన్ని శాసిస్తోన్న ఫోర్ట్‌నైట్‌ ఇంకా పూర్తిస్థాయిలో అన్ని ప్లాట్‌ఫామ్‌లలోకి అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ పలు థర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్స్‌ ద్వారా ఈ గేమ్‌ను పొందేందుకు గేమర్స్‌ వెనకాడటం లేదు. ఇలా చేయటం ప్రమాదకరమని తెలిసినప్పటికీ వారు వెనుకంజ వేయటం లేదు.

క్షణ క్షణం.. ఉత్కంఠభరితం..
ఫోర్ట్‌నైట్‌ వీడియో గేమ్‌లో వంది మంది ప్లేయర్స్‌ ఉంటారు. వీరి వద్ద ఎటువంటి ఆయుధాలు ఉండవు. ప్లేయర్స్‌కు ఇచ్చే మ్యాప్స్‌ ఆధారంగా ఆయుధాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ప్లేయర్స్‌ ఖాళీ నగరంలోని భవనాల్లో పరిగెడుతూ శత్రువులను తుదిముట్టిస్తూ, తమకు కేటాయించిన టాస్కులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కో లెవల్‌ పెరిగేకొద్ది గేమ్‌ మరింత క్లిష్టతరంగా మారుతుంది. చివరి లెవల్‌ వరకు ప్లేయర్‌ బ్రతికి ఉండి టాస్కులను పూర్తి చేసినట్లయితే విజేతగా నిలుస్తారు.

మానసికంగా.. శారీరకంగా..
రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని గేమ్స్‌ ఆడేవారిలో మానసికంగా ఇంకా శారీరకంగా సమస్యలు తలెత్తుతున్నాయని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎక్కువ సమయం వీడియో గేమ్‌లకు కేటాయిస్తున్న వారిలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం, మతిమరుపు లాంటి రుగ్మతలు చోట చేసుకుంటున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే వీడియోగేమ్‌లలో చూపిస్తున్న మితిమీరిన యాక్షన్, అశ్లీల దృశ్యాలు చిన్నారులను చెడుదోవ పట్టించే ప్రమాదం లేకపోలేదు. అందుకే మొబైల్‌ యాప్‌ వీడియో గేమ్‌లతో తస్మాత్‌ జాగ్రత్త. 

మరిన్ని వార్తలు