గణేష్ ఉత్సవాల్లో డీజే నిషేధం: ఆనంద్

25 Aug, 2014 05:20 IST|Sakshi
గణేష్ ఉత్సవాల్లో డీజే నిషేధం: ఆనంద్

సాక్షి, సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాలలో డీజే సౌండ్‌ను నిషేధించామని, ఎవరైనా పోలీసుల కళ్లుగప్పి డీజేలను ఏర్పాటు చేస్తే ఉత్సవ కమిటీతో పాటు వాటిని అద్దెకిచ్చిన వారిపైనా కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు తగిన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  

ఆదివారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిర్వాహకులే  బాధ్యత తీసుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజున కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ఉత్సవ కమిటీలదేనని, వారు పోలీసులకు సహకరించాలని కోరారు.

ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావు మాట్లాడుతూ, పోలీసు అధికారుల సూచన మేరకు డీజేలను నిషేధిస్తామన్నారు.  చెరువులలో పూడిక తీయాలని, విగ్రహాల తరలింపునకు తొందర పెట్టవద్దని, ఉచిత విద్యుత్‌ను ఇవ్వాలని, క్రేన్ నిర్వహణ లోపాలు జరగకుండా చూసేందుకు ఉన్నతాధికారిని నియమించాలని ఆయన కోరారు. సమావేశంలో జాయింట్ కమిషనర్ వై.గంగాధర్, ఆయా జోన్ల డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలతో  పాటు గణేష్ ఉత్సవ కమిటీసభ్యులు పాల్గొన్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా