డీజే, జేసీజే పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగింపు

11 Aug, 2015 01:43 IST|Sakshi
డీజే, జేసీజే పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగింపు

* హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
* సెప్టెంబర్ 16న తుది విచారణ

 సాక్షి, హైదరాబాద్: జిల్లా జడ్జీలు (డీజే), జూనియర్ సివిల్ జడ్జీలు (జేసీజే) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతం నిలిచిపోయిన ప్రక్రియను కొనసాగించాల్సిందిగా ఉమ్మడి హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 12 జిల్లా జడ్జీల పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి అర్హులకు నియామకపు పత్రాలు అందచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే ఈ నియామకాలు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని వారికి స్పష్టం చేయాలని తెలిపింది.

అదే విధంగా జూనియర్ సివిల్ జడ్జీల పోస్టుల భర్తీ విషయంలో 2014, 2015 నోటిఫికేషన్ల ఆధారంగా జరిగిన రెండు స్క్రీనింగ్ టెస్ట్‌లకు సంబంధించిన సమాధాన పత్రాలను మూల్యాంకనం చేపట్టాలని ఆదేశించింది. అనంతరం రాతపరీక్ష, ఇంటర్వ్యూలు పూర్తి చేసి, వాటి ఫలితాలను నియామకపు అధికారుల ముందు ఉంచాలని రిజిస్ట్రీకి సూచిం చింది. అయితే నియామకపు ప్రక్రియను ఖరారు చేయవద్దని తెలిపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాస నం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

తుది విచారణ నిమిత్తం ఈ వ్యాజ్యాలను సెప్టెంబర్ 16కి వాయిదా వేసింది. కింది స్థాయి న్యాయవ్యవస్థను విభజించేంత వరకు న్యాయాధికారుల పోస్టులను భర్తీ చేయవద్దని, అలాగే జేసీజే పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లను కొట్టేయాలని కోరుతూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరికొందరు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం.. సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

డీజే, జేసీజే పోస్టుల భర్తీకి గతంలో విధించిన గడువును పొడిగించాలన్న హైకోర్టు అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది కాబట్టి ఆ ప్రక్రియను కొనసాగించాల్సిందేనని, లేకపోతే అది కోర్టు ధిక్కారం అవుతుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా