సీఎం కేసీఆర్‌పై డీకే అరుణ ఫైర్‌

21 Oct, 2019 13:58 IST|Sakshi

సాక్షి, మహబూబ్ నగర్ : ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ చేస్తున్న సమ్మె సోమవారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ నాయకురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే సకల జనుల సమ్మెగా మారుతున్న ఆర్టీసీ సమ్మెలో కేసీఆర్ కొట్టుకుపోతాడని డీకే అరుణ విమర్శించారు. ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్‌ డిస్మిస్ అనడానికి కేసీఆర్‌కు అర్హత లేదని, సెల్ఫ్‌ డిస్మిస్‌ అనే పదం కేసీఆర్‌కే వర్తిస్తుంది కానీ కార్మికులకు కాదన్నారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చుకున్నా.. ఆర్టీసీ అప్పులు మాత్రం చెల్లించలేక పోయారన్నారు.

ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు ఎందుకు చెల్లించ లేదో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌ అవినీతి బయటపడి జైలుకు పోయే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఆర్టీసీని పరిరక్షించాల్సిన ప్రభుత్వం, ఆర్టీసీ ఆస్తులను టీఆర్‌ఎస్‌ నాయకుల చేతుల్లో పెట్టి చోద్యం చూస్తోందని విమర్శించారు. హైకోర్టు తీర్పును సీఎం కేసీఆర్ గౌరవించి ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలన్నారు.

మరిన్ని వార్తలు