కేసీఆర్‌.. మాతో రండి. చూసొద్దాం

30 Aug, 2019 18:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోపు పూర్తి చేస్తామన్న సీఎం కేసీఆర్‌ మాటలన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ విమర్శించారు. కేసీఆర్‌ ఈ మాట చెప్పి ఆరేళ్లయిందని ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొందరు దుర్మార్గులు, ప్రగతి నిరోధక శక్తులు కేసులేశారని పాలమూరు పర్యటనలో కేసీఆర్‌ అన్నారు, కానీ ఆ ప్రగతి నిరోధక శక్తులంతా ఆయన పక్కనే స్టేజీపై ఉన్నారని కౌంటరిచ్చారు. పాలమూరు జిల్లాకు కేసీఆర్‌ దరిద్రపు గొట్టులా మారాడని, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టుల కోసం పోరాడింది తానేనన్నారు. పాలమూరులో ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ హయాంలోనే మొదలయ్యాయని గుర్తు చేశారు. అబద్ధాలు చెప్పడానికి సిగ్గుండాలనీ, మాటలతో ప్రజలను మోసం చేయడం మానెయ్యాలని హితవు పలికారు. ‘కేసీఆర్‌.. బీజేపీతో బస్సుయాత్రకు రండి. ఎక్కడెక్కడ నీళ్లిచ్చారో చూసొద్దామం’టూ సవాల్‌ విసిరారు. డీకే అరుణ హారతులు పట్టిందని తప్పు పట్టిన కేసీఆర్‌కు ఇప్పుడు ఏపీ సీఎంపై ప్రేమెందుకు పుట్టిందని నిలదీశారు. 

మరిన్ని వార్తలు