తల్లీబిడ్డలను కలిపిన డీఎన్‌ఏ

7 Dec, 2017 04:16 IST|Sakshi
చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్, డాక్టర్‌ పద్మజ

నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వారం క్రితం బిడ్డలు తారుమారు 

డీఎన్‌ఏ పరీక్షతో తేలిన పంచాయితీ

సాక్షి, హైదరాబాద్‌: ఆ తల్లీ బిడ్డలను డీఎన్‌ఏ పరీక్ష కలిపింది. ఎవరి పిల్లలు వారికి దక్కడంతో వారం రోజులుగా తల్లడిల్లిన ఆ తల్లుల కళ్లల్లో ఆనందం వ్యక్తమైంది. హైదరాబాద్‌లోని ఏఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన శివకుమార్‌ భార్య అఖిల, ఎల్బీ నగర్‌కు చెందిన మహేశ్‌ సతీమణి మనీషారాణి ప్రసవం కోసం ఇటీవల నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చేరారు. నవంబర్‌ 29న ఒకే సమయంలో వేర్వేరుగా ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చారు. ప్రసూతి విభాగంలోని కిందిస్థాయి సిబ్బంది శిశువులకు కట్టిన ట్యాగ్‌ను  పరిశీలించకుండానే ఒకరి బిడ్డను మరొకరికి అప్పగించారు. బంధువులకు అనుమానం వచ్చి ఆందోళనకు దిగడంతో అప్రమత్తమైన ఆస్పత్రి వైద్యులు అదే రోజు శిశువులకు రక్త పరీక్ష నిర్వహించి, వారి తల్లులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలపై తమకు నమ్మకం లేదని, డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని శిశువుల తల్లిదండ్రులు పట్టుబట్టడంతో ఆ మేరకు డిసెంబర్‌ ఒకటో తేదీన శిశువులు, తల్లిదండ్రుల నుంచి రక్తపు నమూనాలు సేకరించారు. బుధవారం ఉదయం డీఎన్‌ఏ ఫలితాలు వచ్చాయి. రిపోర్టు ఉన్న సీల్డ్‌ కవర్‌ను ఉప్పల్‌ ఎమ్మెల్యే ప్రభాకర్, ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పద్మజ, శిశువుల తల్లిదండ్రుల సమక్షంలో తెరిచి, అందులో ఏముందనేదీ బయటికి చదివి వినిపించారు. ముందస్తుగా అప్పగించినట్లు ఎవరి శిశువు వారి చెంతే ఉన్నట్లుగా రిపోర్టులో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

వెంటనే అప్రమత్తమయ్యాం:  ఈఎస్‌ఐ మెడికల్‌ సూపరింటెండెంట్‌
ఆస్పత్రి కి ంది స్థాయి సిబ్బంది పొరపాటు వల్ల చిన్నారుల తారుమారు జరిగిందని నాచారం ఈఎస్‌ఐ మెడికల్‌ సూపరెండెంట్‌ డాక్టర్‌ పద్మజ చెప్పారు.  తల్లిదండ్రులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని పట్టు పట్టడంతో రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. ఎవరి పిల్లలు వారి వద్దనే ఉన్నట్లు తేలిందని చెప్పారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

మళ్లీ ఇలాంటి పొరపాట్లు జరగరాదు
ఆస్పత్రిలో చిన్నారుల తారుమారు ఘటనపై చిన్న చిన్న పొరపాట్లే తప్పిదాలకు దారి తీస్తుంది. ఈ విషయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి.
– ఎమ్మెల్యే ప్రభాకర్‌

ఎంతో ఆవేదన చెందాం
తమకు కొడుకు పుట్టాడని ఎంతో సంతోషపడ్డాము. ఇంతలోనే శిశువుల తారుమారు ఘటన తమను ఎంతో ఆవేదనకు గురిచేసింది. వారం రోజులుగా మానసిక ఆందోళనకు గురయ్యాం. చివరకు మా పిల్లలు మా దగ్గర ఉన్నారనే విషయం తెలియడంతో సంతోషంగా ఉంది.
 – అఖిల, మనీషారాణి

మరిన్ని వార్తలు