పవర్‌ప్లాంట్ నిర్వాసితులకు న్యాయం చేయండి

10 Oct, 2014 01:09 IST|Sakshi

ముఖ్యమంత్రికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పాయం విజ్ఞప్తి
వైఎస్సార్‌సీపీలోనే ఉంటామని తాటితో కలిసి స్పష్టీకరణ
పార్టీ మారుతున్నామంటూ వస్తున్న కథనాలకు ఖండన

 
హైదరాబాద్: మణుగూరు పవర్‌ప్లాంట్ కారణంగా భూమి కోల్పోయే ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సాఆర్‌సీపీ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన సచివాలయంలో సీఎంను కలసి వినతిపత్రం అందజేశారు. పట్టా, అసైన్డ్, గెట్ నంబర్ ఉన్న భూములన్నింటికీ ప్రత్యేక జీవో ద్వారా న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరారు. భూములు కోల్పోతున్న కుటుంబాలకు ఉద్యోగం లేదా శాశ్వత ఉపాధి కల్పించాలని విన్నవించారు. పవర్‌ప్లాంట్ ప్రాజెక్టులో ఉద్యోగాలన్నింటినీ స్థానికులకే ఇవ్వాలని, భూముల పరిహారానికి సంబంధించి అనుమానాలు తొలగించి స్పష్టమైన ప్రకటన చేస్తే స్థానికులే ముందుండి ప్రాజెక్టు పనులు చేయిస్తారని పేర్కొన్నారు. అనంతరం అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, భూమి కోల్పోయే రైతులు, కూలీలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని వివరించారు.

కట్టుకథలు రాస్తూ దుష్ర్పచారం...

నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే పార్టీ మారుతామంటూ మీడియా కట్టుకథలు ప్రసారం చేయడం బాధాకరమని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారబోమని, ఎప్పటికీ వైఎస్సాఆర్‌సీపీలోనే ఉంటామని చెప్పారు. ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ ఉందని, తమ అవసరం లేదన్నారు. గిరిజనులమైనందుకే ఇలాంటి దుష్ర్పచారాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.

నాపై దాడి చేశారు...

 ఆంధ్రలో కలసిన తన నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ఇటీవల అభివృద్ధి కార్యక్రమానికి వెళితే తనపై టీడీపీ వారు ‘తెలంగాణ ఎమ్మెల్యే గోబ్యాక్’ అంటూ దాడిచేశారని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఆంధ్రద్రోహిగా చిత్రీకరించారని, ఆ సందర్భంలో తాను జై తెలంగాణ అనడం తప్పవుతుందా అని అన్నారు.
 

మరిన్ని వార్తలు