కూటమి మాటలు నమ్మొద్దు

15 Nov, 2018 18:26 IST|Sakshi
ఇందల్వాయిలో మాట్లాడుతున్న బాజిరెడ్డి గోవర్ధన్‌

కూటమి మాటలు నమ్మొద్దు కారుకు ఓటేసి అభివృద్ధి జోరు పెంచాలి

ఇందల్వాయి రామాలయ అభివృద్ధికి రూ. 50 లక్షలు కేటాయిస్తాం

టీఆర్‌ఎస్‌ రూరల్‌ అభ్యర్థి బాజిరెడ్డి

    సాక్షి,ఇందల్‌వాయి(నిజామాబాద్‌): ఆంధ్ర పాలకులకు దాసోహమైన మహా కూటమి మాయ మాటలు నమ్మవద్దని, కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి జోరు పెంచాలని టీఆర్‌ఎస్‌ రూరల్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ కోరారు. ఎమ్మెల్సీ వీజీగౌడ్‌తో కలిసి బుధవారం ఆయన ఇందల్వాయి గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే రెండేళ్లలో రూరల్‌ నియోజకవర్గంలో ప్రతీ ఎకరానికి సాగు నీరందిస్తామని బాజిరెడ్డి తెలిపారు. పాసుబుక్కులు రాని రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. గత ప్రభుత్వాలు మాయ మాటలతో పబ్బం గడిపాయని, అందుకు భిన్నంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని చెప్పారు. రానున్న రోజుల్లో కమ్యునిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు ఇస్తామని, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని, ఇందల్వాయి రామాలయ అభివృద్ధికి రూ. 50 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌ హయాంలో ఇంత వరకు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కళాబృందం సభ్యులు ప్రజలకు వివరించారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ సర్పంచ్‌ సదానందం, మాజీ ఎంపీటీసీ గంగాధర్‌గౌడ్‌లకు బాజిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలోని కుల సంఘాలతో సమావేశమయ్యారు. అంతకు ముందు స్థానికులు బాజిరెడ్డికి మంగళ హారతులు, డప్పులతో ఘన స్వాగతం పలికారు. ముదిరాజ్, అంబేద్కర్‌ యువజన సంఘాలు సత్కరించి, తమ సమస్యలు తీర్చాలని వినతిపత్రాలు అందించాయి. మాజీ జెడ్పీటీసీ దినేశ్, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రమేశ్‌నాయక్, నేతలు గడీల రాములు, ముత్తెన్న, హుస్సేన్, గోపాల్, కుమార్, శేఖర్, చింతల దాసు పాశం నర్సింహులు, తొగరి కాశీరాం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు