సాధారణ బస్సు చార్జీలకు మించి వసూలు చేయొద్దు

10 Oct, 2019 08:49 IST|Sakshi
ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ హరీష్‌

ప్రతి బస్సులో చార్జీల పట్టిక

బస్‌పాస్‌లను అనుమతించాలి

ఆర్టీసీ అద్దె బస్సులు రోడ్డెక్కాల్సిందే..

లేదంటే కాంట్రాక్ట్‌ రెన్యూవల్‌ ఉండదు

ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ హరీష్‌

సాక్షి, రంగారెడ్డి: ప్రతి బస్సులో చార్జీల పట్టికను ప్రయాణికులకు కనిపించేలా ఏర్పాటు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ హరీష్‌ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్టేజీ క్యారియర్‌ తదితర బస్సులు ఈ నిబంధనను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాధారణ చార్జీకి మించి ఒక్కపైసా కూడా అదనంగా వసూలు చేయవద్దని, తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లోకి తీసుకుని నడిపిస్తున్న బస్సుల్లో అన్ని రకాల రాయితీ బస్‌పాస్‌లను అనుమతించాలని సూచించారు. 80 శాతం బస్సులను తప్పనిసరిగా ప్రయాణికుల కోసం తిప్పాలన్నారు. ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తీసుకున్న అన్ని బస్సులను రోడ్డెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు. లేకుంటే కాంట్రాక్ట్‌ను రెన్యూవల్‌ చేయబోమని హెచ్చరించారు. పోలీస్‌ అధికారులు, మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ల సహకారంతో బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్లను, ఆర్డీఓలను కోరారు. నైట్‌హాల్ట్‌ బస్సులను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లలో నిలపాలని పేర్కొన్నారు. అర్ధంతరంగా బస్సులు మరమ్మతులకు గురైతే 100కు డయల్‌ చేయాలని సూచించారు. మద్యం మత్తులో విధులకు వచ్చే డ్రైవర్లను, కండక్టర్లను అనుమతించవద్దని పేర్కొన్నారు.   

రూ.6 కోట్ల మేర నష్టం 
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడంతో బస్సులు రోడ్డెక్కకపోవడం వల్ల జిల్లాలో ఆర్టీసీకి బుధవారం నాటికి రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. సాధారణ రోజులతో పోల్చితే దసరా పండగ సీజన్‌లో ప్రయాణికులు అదనంగా 65 శాతం ప్రయాణిస్తారని పేర్కొంటున్నారు. ఈ లెక్కన గత రెండు రోజుల్లోనే సుమారు రూ.4 కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా బుధవారం సుమారు 911 బస్సులు, ప్రైవేటు వాహనాలను రోడ్లపై తిప్పినట్లు డిప్యూటీ ట్రాన్ప్‌పోర్ట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌రావు తెలిపారు. ఇందులో ఆర్టీసీ 262, అద్దె బస్సులు 176, ప్రైవేటు కాంట్రాక్ట్‌ క్యారియర్‌ బస్సులు 78, ప్రైవేటు కంపెనీల బస్సులు 62, స్కూల్‌ బస్సులు 83, ప్రైవేట్‌ క్యాబ్‌లు 250 ఉన్నాయని వివరించారు. సమ్మె ఇంకా కొనసాగితే ఈ వాహనాల సంఖ్యను మరింత పెంచుతామని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు