'మాజీ మంత్రిపై విమర్శలు మానుకోవాలి'

10 Sep, 2015 16:31 IST|Sakshi

శంషాబాద్ రూరల్: పదవులను కాపాడుకోవడానికి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి జిల్లా అభివృద్ధికి అడ్డుపడుతూ వ్యక్తిగత దూషణలు చేయడం తగదని ఎంపీపీ చెక్కల ఎల్లయ్య అన్నారు. మండలంలోని పెద్దషాపూర్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేస్తున్న మహేందర్‌రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. అవినీతి కేసుల విషయంలో అధికారంలో ఉన్నట్టు మీ దగ్గర ఆధారాలుంటే కేసులో సమర్పించాలని ఎద్దేవా చేశారు. ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్పును గట్టిగా వ్యతిరేకిస్తున్న సబితారెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించడం నీతిమాలిన చర్య అని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ హయాంలో సాగునీటి శాఖ ఆధ్వర్యంలో రూ.కోట్లు ఖర్చు చేసి చెరువుల, కుంటలకు మరమ్మతులు చేపట్టామని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్‌ కాకతీయతో ఏదో చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదన్నారు. భూదందాలకు ఎవరు పేరుగాంచారో మంత్రిగారి సొంత మండలానికి వెళ్తే జనాలు చెబుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇస్రానాయక్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోపాల్‌నాయక్, సొసైటీ డైరక్టర్ నర్సింహ, వార్డు సభ్యులు శ్రీధర్, నారాయణ, నాయకులు గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు