ఇందిరాపార్క్‌కు నష్టం కలిగించొద్దు

15 Mar, 2019 00:11 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ అధికారులకు  హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఇందిరాపార్క్‌కు నష్టం కలిగించే చర్యలు చేపట్టవద్దంటూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ చట్ట నిబంధనలకు విరు ద్ధంగా ఇందిరాపార్క్‌కు నష్టం చేకూర్చడం, అందు లోని చెట్లను కూల్చివేయడం, టెన్నిస్‌ ప్లే గ్రౌండ్‌ను తరలించడం లాంటివి చేయొద్దని గురువారం ఆదేశించింది. వీఎస్‌టీ నుంచి ఇందిరాపార్క్‌ మైసమ్మగుడి వద్ద వరకు నిర్మిస్తున్న స్కైవేకి సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టంచేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఆర్‌డీపీ) ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా వీఎస్‌టీ నుంచి ఇందిరా పార్క్‌ మైసమ్మగుడి వద్ద వరకు రూ.350 కోట్లతో స్కైవే నిర్మించా లని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ స్కైవే వల్ల ఇందిరాపార్కు నష్టపోవాల్సి వస్తోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ 102 మంది పౌరులు ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ కోదండరాం గురువా రం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. 2.6 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న స్కైవే వల్ల ఇందిరా పార్క్‌ తీవ్రంగా ప్రభావితమవుతోందని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న దాదాపు 200 చెట్లను కొట్టేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  నగరంలో ఇక్కడ తప్ప ఎక్కడా కూడా సింథటిక్‌ టెన్నిస్‌ కోర్టు లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఇందిరాపార్క్‌ పరిరక్షణకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, పిటిషనర్లు కోరినవిధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులుగా ఉన్న అధికారులకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు