'మహిళలకు అన్యాయం జరగనివ్వొద్దు'

22 Jan, 2015 19:36 IST|Sakshi

వనపర్తి (మహబూబ్‌నగర్‌) : పొట్ట చేతబట్టుకొని భర్తలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారి భార్యలకు అన్యాయం జరగనివ్వొద్దని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం అభిప్రాయపడ్డారు. వారు వేరే ప్రాంతాలకు పోతే ఇంటి వద్ద ఉన్న మహిళలకు భద్రత కరువైందని ఆ అంశం గురించి ప్రభుత్వాలు, చదువుకున్నోళ్లు ఆలోచించాలని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ విద్యావంతుల వేదిక మహబూబ్‌నగర్ తూర్పు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వనపర్తి పట్టణంలోని పాత మున్సిపల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మహిళల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల సమస్యల అధ్యయనం గురించి అన్ని రంగాల్లో ఆలోచన చేయాల్సి ఉందన్నారు. 'ప్రతి ఒక్కరు చదువుకోవాలని, చదువుకునోళ్లకే సమస్యలకు కారణాలు తెలుస్తాయని ఎప్పుడు జయశంకర్ సార్ చెబుతుండే వారని' కోదండరాం పేర్కొన్నారు.  

పొదుపు సంఘాలతో మహిళలు ఇంటి నుంచి బయటకు రావడం ప్రారంభం అయ్యిందని, సకలజనుల సమ్మెతో మహిళలు చైతన్యవంతమైన పాత్ర పోషించడం మరింత పెరిగిందని, అయినా ఆశించిన రీతిలో వారి ప్రగతి కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతి నియోజకవర్గం స్థాయి నుంచి మహిళల సమస్యలను అధ్యయనం చేసి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వాటి పరిష్కారానికి కార్యచరణ మొదలు పెట్టేందుకు ముందుకు కదులుతున్నట్లు వివరించారు. మహిళలు తెలంగాణ ఉద్యమంలో ముందున్నట్లే అభివృద్దిలోనూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా