భయంతో బెయిల్‌ పొందలేరు

15 May, 2019 03:42 IST|Sakshi

భయం, అపోహలతో ముందస్తు బెయిల్‌ సాధ్యం కాదు

ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: తనను అరెస్ట్‌ చేస్తారనే భయం లేదా అపోహలతో ముందస్తు బెయిల్‌ పొందలేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏదో జరిగిపోతుందనే భయంతో సీఆర్‌పీసీలోని 438 సెక్షన్‌ కింద ముందస్తు బెయిల్‌ పొందలేరని స్పష్టం చేసింది. కేసు నమోదయ్యాక అరెస్ట్‌ చేస్తారనే కారణాలు చూపినప్పుడే ముందస్తు బెయిల్‌ ఇవ్వడం సాధ్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఆర్థిక లావాదేవీల వ్యవహారం బెడిసికొట్టిన నేపథ్యంలో దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. సయ్యద్‌ మహబూబ్‌ అనే వ్యక్తి తన బంగారాన్ని కుదవపెట్టి రూ.4.15 లక్షలు, రూ.85 వేల నగదును కలిపి మహ్మద్‌ ఇమ్రాన్, అబ్దుల్‌ ఖవీలకు అప్పుగా ఇచ్చాడు.

ఆ మొత్తాన్ని మూడు నెలల్లో తిరిగి చెల్లించే వరకూ ప్రతి నెలా రూ.12,500 చొప్పున వడ్డీ ఇస్తామని చెప్పి తనను మోసం చేశారని మహబూబ్‌ ఆ ఇద్దరిపై చీటింగ్‌ (420)తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసు పెట్టారు. సీఆర్‌పీసీ ప్రకారం పోలీసులు నోటీసు జారీ చేయడంతో వారిద్దరూ ముందస్తు బెయిల్‌ కోసం కింది కోర్టును ఆశ్రయించితే ఫలితం లేకుండా పోవడంతో.. హైకోర్టులో అప్పీల్‌ చేశారు. పంజాబ్, రాజస్తాన్‌ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను న్యాయమూర్తి ఉటంకిస్తూ, అరెస్ట్‌ చేస్తారని కచ్చితమైన కారణాలు చెప్పకుండా కేవలం భయం లేదా అపోహల కారణంగా ముందస్తు బెయిల్‌ మంజూరు పొందజాలరని హైకోర్టు తేల్చిచెప్పింది. వ్యాజ్యాల్ని తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. 

మరిన్ని వార్తలు