ఎంఎస్‌ఎంఈ రుణాలపై చిన్నచూపొద్దు

29 Jul, 2017 02:45 IST|Sakshi
ఎంఎస్‌ఎంఈ రుణాలపై చిన్నచూపొద్దు

బ్యాంకర్లకు ఈటల సూచన
సాక్షి, హైదరాబాద్‌: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు రుణాల జారీలో బ్యాంకులు చిన్న చూపు చూడడం తగదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. పది మందికి ఉపాధి కల్పించాలనే తపన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు ఉంటుందన్నారు. బ్యాంకులు వీరికి సకాలంలో రుణాలు అందించకపోతే తీవ్రంగా నష్టపోతారన్నారు. ఎంఎస్‌ఎంఈలకు రుణ అవకాశాలపై ‘ది ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ, ఏపీ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ’ (ఎఫ్‌టీఏసీసీఐ) శుక్రవారం ఇక్కడ నిర్వహించిన బ్యాంకర్ల సదస్సులో మంత్రి ఈటల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు విస్తరించకపోతే నిరుద్యోగులకు ఉపాధి లభించదన్నారు. ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పించడం ఏ రాష్ట్రానికీ సాధ్యం కాదని, ప్రైవేటు రంగంలోనే 95% ఉద్యోగావకాశాలుంటాయన్నారు. కేంద్రీకృత ఆర్థిక విధానాలతో పేదరికం పెరిగిపోతుందని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికాభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరముందన్నారు. గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో సిబ్బందిని తగ్గించడంతో స్థానిక ప్రజలకు సరైన బ్యాంకింగ్‌ సదుపాయం లభించడం లేదని ఈ మేరకు బ్యాంకులు సిబ్బందిని పెంచుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు