వాట్సాప్‌ సందేశాలకు ఆవేశపడకండి!

16 Jul, 2018 01:38 IST|Sakshi

     వదంతులను వ్యాప్తి చేయకండి 

     ప్రజలకు రాష్ట్ర ఐటీ శాఖ సూచన 

సాక్షి, హైదరాబాద్‌: వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న నకిలీ వార్తలు, వదంతులను నమ్మి అమాయకులపై ఇటీవల దాడులు పెరిగిపోతున్నాయి. పిల్లలను ఎత్తుకుపోయే ముఠాలంటూ వచ్చే వాట్సాప్‌ సందేశాలను నమ్మి చట్టాన్ని ప్రజలు చేతుల్లోకి తీసుకుంటున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల కర్ణాటకలోని బీదర్‌లో ముగ్గురు హైదరాబాదీలను పిల్లల కిడ్నాపర్లుగా భావించి వారిపై స్థానికులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ఆజం అనే వ్యక్తి మృతి చెందాడు. రాష్ట్రంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో నకిలీవార్తలు, వదంతులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐటీ శాఖ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ప్రారంభించింది. నకిలీ వార్తలు, వదంతులు, పుకార్లను గుర్తించేందుకు సూచనలు జారీ చేసింది. 

- చూడగానే నమ్మలేని విధంగా ఉండే సందేశాలు చాలాసార్లు నిజమైనవి కావని పరిశీలనలో తేలింది.
కావాలని రెచ్చగొట్టేట్లు ఉన్న సందేశాల్లో అర్ధ సత్యాలు, అసత్యాలు ఉంటాయి. వాటిని చదివి ఆవేశపడకండి. నిజాలు తెలుసుకోకుండా ఫార్వర్డ్‌ చేయకండి.
ఎక్కడో జరిగిన సంఘటనల ఫొటోలు, వీడియోలు మన దగ్గర జరిగినట్లు వ్యాప్తి చేయడం ఇటీవల బాగా పెరిగింది. ఉదాహరణకు పక్కదేశంలో జరిగిన ప్రమాదం హైదరాబాద్‌లో జరిగినట్లు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు.
పిల్లలను ఎత్తుకుపోయే ముఠాలు తిరుగుతున్నాయి అని వాట్సాప్‌లో షేర్‌ అవుతున్నవి నకిలీ వీడియోలు. వేరే వీడియోలను ఎడిట్‌ చేసి సృష్టించిన ఈ వీడియోలు నిజం కాదు. నమ్మకండి.  
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి, పెద్దగా పరిచయం లేని వాళ్ల నుంచి వచ్చే సందేశాలు అవాస్తవాలు కావచ్చు. వాటిని వెంటనే నమ్మి ఫార్వర్డ్‌ చేయకండి. 
వాట్సాప్‌ వంటి మాధ్యమాల ద్వారా చాలా సార్లు వదంతులు వ్యాప్తి చెందే అవకాశముంది. ఎక్కువ మంది నుంచి ఒకటే సమాచారం వస్తే దాన్ని నిజం అనుకోకండి.  
వదంతుల వ్యాప్తి కూడా శిక్షార్హమైన నేరమే.  
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు తెలపండి. వారిని కొట్టడం వంటి పనులు చేయకండి. రాష్ట్రంలో పటిష్టమైన పోలీసు యంత్రాంగం ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకండి.   

మరిన్ని వార్తలు