మా భూములు లాక్కోవద్దు సారు.. 

7 Mar, 2019 07:31 IST|Sakshi
మద్నూర్‌లో తహసీల్దార్‌రవీందర్‌కు వినతి పత్రం అందిస్తున్న బాధితులు 

30 ఏండ్ల సంది పంటలేసుకుంటున్నాం 

అన్యాయం చేయవద్దంటూ తహసీల్దార్‌కు వినతి 

మద్నూర్‌(జుక్కల్‌): గత 30 ఏండ్ల సంది ఈ భూముల్లో పంటలు వేసి బతుకుతున్నాం.. మా పిల్లల పెండ్లీలు, శుభకార్యాలు ఈ భూములపై వచ్చిన ఆదాయంతోనే చేసినం.. ఇప్పుడు అటవీశాఖ సార్లు వచ్చి హద్దులు పాతడం ఏంటి.. అంటూ నిరుపేద రైతులు తహసీల్దార్‌ రవీందర్‌ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం చేయాలంటూ రైతులు వినతి పత్రం అందించారు. మండలంలోని సుల్తాన్‌పేట్‌ గ్రామ శివారులో గల 189 సర్వే నెంబరులోని అసైండ్‌ భూమిని 30ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఎస్సీ, ఓబీసీలైన నిరుపేదలకు పట్టాలు చేసి పంచిపెట్టింది. అప్పటి నుంచి నేటి వరకు ఆయా అసైండ్‌ భూముల్లో రైతులు పంటలు వేస్తూ జీవనం సాగిస్తున్నారు.

పది రోజుల క్రితం ఆటవీశాఖ అధికారులు తమ పంట భూముల్లో హద్దులు పాతారని వారు తహసీల్దార్‌కు వివరించారు. రైతులకు పంపిణీ చేసిన భూములు ఆటవీశాఖకు చెందినవని చెబుతుండడంతో తమ దృష్టికి తెచ్చామని వారు అన్నారు. ఆ స్థలం పక్కన గల భూమిలో గ్రామ రెవెన్యూ అధికారులకు ఇండ్ల స్థలాలు కూడా కేటాయించారని అన్నారు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు. దీంతో స్పందించిన తహసీల్దార్‌ ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల్లో పంటలు వేసుకుని పండించుకోవచ్చన్నారు. తహసీల్‌ కార్యాలయానికి వచ్చిన వారిలో సుందర్‌బాయి, మారుతి, లక్ష్మణ్, గంగవ్వ, జరినాబేగం, శారద, సాయిలు ఉన్నారు.

మరిన్ని వార్తలు