ఓటేస్తూ  సెల్ఫీలు  వద్దు

23 Nov, 2018 12:48 IST|Sakshi

షాద్‌నగర్‌ టౌన్‌: ఇటీవల సెల్ఫీలు తీసుకోవడం జనానికి ఓ సరదాగా మారిపోయింది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఇట్టే సెల్‌ఫోన్‌ కెమెరాతో బంధిస్తున్నారు. విందులు, వినోదాలు, శుభకార్యాలు, విహార యాత్రలతో పాటుగా మిత్రులు, బంధువులతో సరదాగా గడిపే సన్నివేశాలను సెల్ఫీలు తీసుకుంటుంటారు.

అయితే, ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్‌ను సైతం యువత సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉంది. పోలింగ్‌ కేంద్రంలో ఓటేస్తూ సెల్‌ఫోన్‌తో సెల్ఫీలు తీసుకోవాలనుకుంటే ఇబ్బందులు తప్పవు. ఓటేస్తూ పోలింగ్‌ కేంద్రంలో సెల్ఫీలు దిగడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది.  

ఓటేస్తూ సెల్ఫీలు దిగడం నిషేధం 
పోలింగ్‌ కేంద్రంలో ఓటేస్తూ సెల్ఫీలు తీసుకోవడాన్ని ఎన్నికల సంఘం పూర్తిగా నిషేధించింది. ఒకవేళ ఓటరు అలా చేస్తే 49ఎం(ఓటు రహస్యం) బహిర్గతం నియమం మేరకు ఎన్నికల అధికారులు ఓటరును బయటకు పంపించేస్తారు. ఆ ఓటును ఎన్నికల నియమావళిలోని 17ఏలో నమోదు చేస్తారు. అయితే, ఓట్ల లెక్కింపు సమయంలో సదరు ఓటును పరిగణలోకి తీసుకోరు.

ఎంతో ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేసి సెల్ఫీలు తీసుకొని ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా మెలగడం మంచిది. ఎన్నికల్లో ఒక్కో ఓటు కూడా ఎంతో కీలకం. ఈనేపథ్యంలో సెల్ఫీలు కట్టిపెట్టి నిబంధనలు పాటించి  ఈవీఎంలో తమకు నచ్చిన నేతకు ఓటు వేసి బయటికి రావాలి.  

మరిన్ని వార్తలు