బంగారంపై తీరిన బెంగ

22 Jan, 2018 18:01 IST|Sakshi

బెల్లం విక్రయాలపై ఆంక్షల ఎత్తివేత

సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం

ఉమ్మడి జిల్లాల్లో పెరగనున్న అమ్మకాలు

పాల్వంచ (రూరల్‌) : ప్రతి రెండేళ్లకోసారి మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం(బెల్లం) చెల్లిస్తారు. ఈ నెల 31 నుంచి నాలుగు రోజులపాటు జాతర జరగనుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో మేడారం తరలివెళ్తున్నారు. అయితే మొక్కలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బెల్లం స్థానికంగా ఎక్కువగా అమ్మకపోవడంతో మేడారం వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది. నాటుసారా(గుడుంబా) నియంత్రణ పేరుతో ప్రభుత్వం సంక్రాంతి పండగ ముందునుంచే ఆంక్షలు విధించింది. ఒక్కరికి 2 కేజీలకు మించి విక్రయించొద్దని, అది కూడా ఆధార్‌ కార్డు జిరాక్స్‌ తీసుకుని విక్రయించాలని వ్యాపారులను ఆదేశించింది.

ఎక్సైజ్, పోలీసు శాఖల అధికారులు కేసులు నమోదు చేయడంతో వ్యాపారులు విక్రయాలను నిలిపివేశారు. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బెల్లం కొరత ఏర్పడింది. జాతర సమయంలో ఈ నిబంధన ఇటు వ్యాపారులకు, అటు భక్తులకు ఇబ్బంది కలిగించింది. ఆయా ప్రాంతాల్లో బెల్లం విక్రయాలు లేకపోవడంతో భక్తులు మేడారం వెళ్లి కొనుగోలు చేసి మొక్కలు చెల్లిస్తున్నారు. మార్కెట్‌లో బెల్లం కేజీ ధర సుమారు రూ.50 ఉంటే అక్కడ రూ.100పైగా విక్రయిస్తున్నారు. దీంతో భక్తుల్లో ఒకింత అసహనం ఏర్పడింది. ఈ క్రమంలో నిబంధనలు సడలించాలని ఎక్సైజ్‌ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటినుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఆంక్షలు లేకుండా విక్రయాలు జరుపుకునేందుకు ఎక్సైజ్‌శాఖ అనుమతించింది. నిబంధనలను సడలించడంతో పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు