పింఛన్ ఇస్తారా? చావమంటారా?

16 Nov, 2014 00:53 IST|Sakshi
పింఛన్ ఇస్తారా? చావమంటారా?
  • ఐకేపీ భవనం ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన వికలాంగులు
  • ఇబ్రహీంపట్నం: పింఛన్ ఇస్తారా? చావమంటారా? అని వికలాంగులు ఆందోళనకు దిగారు. అర్హులందరికీ పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు ఐకేపీ భవనంపైకి ఎక్కి ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది.

    అర్హులైన వికలాంగ, వితంతు, వృద్ధులకు పింఛన్ సౌకర్యం తొలగించారని, వారందరికీ తక్షణం పింఛన్ పునరుద్ధరించాలని కోరుతూ రెండు రోజులుగా ఇబ్రహీంపట్నంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష చేస్తున్నారు. శనివారం మండలంలోని రాయ్‌పోల్ గ్రామానికి చెందిన వికలాంగులు మహేందర్, అబ్బసావులు, మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన కృష్ణ, అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన శంకర్ కిరోసిన్ బాటిళ్లతో ఐకేపీ భవనంపైకి వెళ్లి గేటుకు తాళం వేసుకున్నారు.

    అర్హులందరికీ పింఛన్ సౌకర్యం కల్పించాలని, జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని, కలెక్టర్ ప్రతినిధిగానే తాను ఇక్కడకు వచ్చానని ఆర్డీఓ యాదగిరిరెడ్డి వీహెచ్‌పీఎస్ నేతలకు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు భవనం దిగి వచ్చారు.
     

మరిన్ని వార్తలు