జాబు కావాలా బాబూ..?

16 Mar, 2018 11:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కాంట్రాక్టు ఉద్యోగాల పేరిట మోసం

పదుల సంఖ్యలో మోసపోయిన నిరుద్యోగులు

మోసాలకు చెక్‌ పెట్టేదెన్నడు?

సిద్దిపేట టౌన్‌: ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటంతో పైరవీకారులు కొత్త దందాకు తెరతీశారు. తమకున్న పరిచయాలతో కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగంపై ఆశతో కొందరు ఈ మోసగాళ్ల వలలో పడుతున్నారు. జాబ్‌ కావాలంటే ఖర్చు అవుతుంది లేకపోతే ఊరికే రాదు కదా అంటూ నిరుద్యోగుల దగ్గర నమ్మబలుకుతున్నారు. వారి మాటలు నమ్మి జాబ్‌ వస్తుందనే సంతోషంలో తర్వాత పరిణామాలు ఏమిటనేది ఆలోచించకుండానే అడిగినన్ని డబ్బులు వారి చేతిలో పెడుతున్నారు.

వివిధ శాఖల జిల్లా అధికారులతో పరిచయాలు పెంచుకొని రోజు కలెక్టరేట్‌కు, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అక్కడికి వచ్చిన వారితో మాటామాటా కలిపి వారిని జాబ్‌ ఇప్పిస్తామంటూ నమ్మించి మోసం చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలోని సుమారు 40 మంది వరకు ఉద్యోగాలకోసం పైరవీకారులకు డబ్బులు ఇచ్చి వారి వెంట తిరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. జాబ్‌లు ఇప్పిస్తామంటూ కలెక్టరేట్‌లోని ఓ ఉన్నతాధికారి పేరును వాడుకుంటూ అతనికి మాకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. మేం ఎవరికి జాబ్‌ కావాలని చెప్పితే వారికి జాబ్‌ ఇస్తారంటూ నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు.

కలెక్టరేట్‌లోనే తిష్ట...
ఒక వ్యక్తికి కలెక్టరేట్‌లో జాబ్‌ ఇప్పిస్తామని అందులో పనిచేసే అతను సుమారు రూ.1 లక్ష తీసుకొని 2 నెలల్లో జాబ్‌ ఇప్పిస్తామని చెప్పినట్టు సమాచారం. డబ్బులు తీసుకొని 6 నెలలకు పైగా గడిచినా జాబ్‌ ఇప్పించకపోవడంతో విసిగిపోయిన సదరు వ్యక్తి డబ్బులు తీసుకున్న వ్యక్తికోసం 2 నెలలుగా రోజు కలెక్టరేట్‌కు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వేచి చూస్తూ తిరిగిపోతున్నాడు.

కలెక్టరేట్‌లోకి ఒక సాధారణ వ్యక్తిరోజు ఉదయం వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నా ఎందుకు వస్తున్నాడంటూ అతని గురించి ఎవరూ ఆరా తీయకపోవడం విశేషం. డబ్బులు తీసుకున్న వ్యక్తి బుజ్జగిస్తూ రేపూ మాపు వస్తుంది అంటూ తిప్పుతుండడంతో గట్టిగా నిలదీయడంతో అతని డబ్బులు అతనికి తిరిగి ఇస్తానంటూ చెప్పినట్టు తెలిసింది. దీనిపై కలెక్టరెట్‌ అధికారుల వివరణ కోరేందుకు యత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు.

అధికారుల అండా.. లేక ప్రజాప్రతినిధులదా!
జాబ్‌లు ఇప్పిస్తామంటూ ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్న కొందరు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అధికారులతో సాన్నిహిత్యం పెంచుకొని అమాయకులను నమ్మించి వారి జేబులు కొల్లగొడుతున్నారు. ప్రజాప్రతినిధులే అనుకుంటే ప్రభుత్వ అధికారులు సైతం ఉద్యోగాల పేరిట పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా జిల్లాలో ఓ 10, 15 మంది పైరవీకారులుగా అవతారం ఎత్తి అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నా ఎవరూ దీని గురించి నోరు మెదపడం లేదు. డబ్బులు ఇచ్చి మోసపోయిన వారు సైతం వీరి గురించి వివరాలు చెప్తున్నారు తప్పితే బయటకు వచ్చి నిలదీసేవారు ఎవరూ లేకపోవడం కొసమెరుపు. ఇలాంటి వాటికి ఇకనైనా ఫుల్‌స్టాప్‌ పడుతుందా లేదా చూడాలి. 

మరిన్ని వార్తలు