కాన్పు చేసిన నర్సులు

14 Aug, 2018 15:03 IST|Sakshi
మాట్లాడుతున్న కల్వకుర్తి సీఐ సురేందర్‌రెడ్డి   

కల్వకుర్తి టౌన్‌ : వైద్యులు లేకుండా నర్సులే ఓ మహిళకు ప్రసవం చేయడంతో చిన్నారికి పేగు చుట్టుకుని మృతి చెందిందింది. ఈ ఘటన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి ప్రభత్వ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. కల్వకుర్తి ఎస్‌ఐ రవి, బాధితురాలి భర్త రమేష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండ లం ఫిరోజ్‌ నగర్‌ గ్రామపంచాయతీకి చెందిన మంగమ్మ కాన్పు కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి సోమవారం ఉదయం వచ్చింది.

ఆమెను పరీక్షించిన వైద్యులు సాయంత్రం సాధారణ కాన్పు చేద్దాం.. అంతా సిద్ధం చేయాలని నర్సులకు సూచించి వెళ్లిపోయారు. అయితే, మంగమ్మ నొప్పులు తీవ్రమవుతున్నా వైద్యులు రాకపోవటంతో నర్సులే కాన్పు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాన్పు చేస్తుండగా.. బిడ్డకు పేగు చుట్టుకుని ఉండడంతో ఆందోళన చెందిన నర్సులు వైద్యుడు శివరాంకు ఫోన్‌లో సమాచారం ఇవ్వగా ఆయన బయలుదేరగా.. వచ్చేటప్పటికే బాబు చనిపోయాడు.

ఈ విషయమై వైద్యుడు శివరాంను అడగగా.. మంగమ్మ పరిస్థితిని నర్సులు తనకు చెప్పగా.. సాధారణ ప్రసవం వీలు కాకపోతే సిజేరియన్‌ చేద్దామని ప్రయత్నించినా అప్పటికే బిడ్డ బయటకు రావడంతో చనిపోయాడని తెలిపారు. నర్సులు కాన్పులు చేయొచ్చా అని అడిగితే.. సాధారణ కాన్పులు చేయొచ్చు కానీ క్లిష్ట పరిస్ధితి ఎదురైతే వైద్యులకు సమాచారం ఇస్తారని పేర్కొన్నారు.

కానీ ఈ విషయమై మంగమ్మ బంధువులు మాట్లాడుతూ కాన్పు పూర్తిగా నర్సులే చేశారని, పూర్తిగా బిడ్డ బయటకు వచ్చాకే వైద్యుడు చేరుకున్నారని తెలిపారు. ఈ విషయం తెలియగానే కల్వకుర్తి సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్సై రవి చేరుకుని బాధితులతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు