‘పూల’బాట!

22 Nov, 2017 03:28 IST|Sakshi

     అమెరికాలో వైద్యుడు.. ఖైతాపురంలో కర్షకుడు

     విలాసవంతమైన జీవితం ఉన్నా సాధారణ రైతులా హర్షారెడ్డి 

     పదిహేను రోజులు యూఎస్‌లో.. మరో పక్షం రోజులు ఖైతాపురంలో...

చౌటుప్పల్‌: అతని వృత్తి వైద్యం.. ప్రవృత్తి వ్యవసాయం. అమెరికాలో ఉన్నత స్థానంలో ఓ వైద్యుడు ఇక్కడ సేద్యం వైపు అడుగులు వేసి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. విలాసవంతమైన జీవితం ఉన్నా.. సాధారణ రైతులా వ్యవహరి స్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయనే హర్షారెడ్డి. నల్లగొండ జిల్లా తిప్పర్తికి చెందిన ఎరమాద రామచంద్రారెడ్డి–భారతి దంపతుల కుమారుడే హర్షారెడ్డి.  చౌటుప్పల్‌ మండలం ఖైతాపురంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న నాలుగున్నర ఎకరాలు భూమిని  హర్షారెడ్డి కొనుగోలు చేశాడు. తన మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు 2016లో ప్రభుత్వ సబ్బిడీపై మూడున్నర ఎకరాల్లో మూడు పాలీహౌస్‌లు ఏర్పాటు చేశాడు.  

పాలీహౌస్‌లో జర్బెరా పూల సాగు 
పాలీహౌస్‌లో హర్షారెడ్డి జర్బెరా పూల సాగును ఎంచుకున్నాడు. మహారాష్ట్రలోని పుణె నుంచి ప్రత్యేకంగా జర్బెరా నారు తెప్పించారు. ఒక్కో మొక్క రూ. 28 నుంచి 30 చొప్పున కొనుగోలు చేశాడు. ఎకరానికి 24 వేల మొక్కలు నాటాడు. ఎకరం సాగులో ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు వేల వరకు పూల దిగుబడి వస్తుంది. 

మొక్కల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ
పూల మొక్కలపై హర్షారెడ్డి వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. రోజువారీగా మొక్కల సంరక్షణలపై షీట్‌ తయారు చేస్తారు. పుణేలో ఉన్న హార్టికల్చర్‌ సాగు నిపుణుడు విజయ్‌ తురాట్‌ అవసరాన్ని బట్టి ఇక్కడకు రప్పిస్తారు. సాగుకు అవసరమయ్యే నీటి కోసం ప్రాంగణంలో పెద్ద బావిని తవ్వారు. వర్షం నీరు ఇందులోకి వచ్చేలా పైప్‌లైన్‌లను వేశారు. 

15 రోజులు అక్కడ.. 15 రోజులు ఇక్కడ..
హర్షారెడ్డి  15 రోజులపాటు అమెరికాలో ఉంటే మరో 15 రోజులు ఖైతాపురంలో ఉండేలా షెడ్యూల్‌ను తయారు చేసుకున్నారు. అమెరికాలో ఉన్నప్పుడు పూల సాగుకు సంబంధించిన వ్యవహారాలు చేపట్టలేకపోతున్నానన్న బాధ లేకుండా తన పాలీహౌజ్‌లో పూర్తిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ కెమెరాల పనితీరును తన సెల్‌ఫోన్‌తో కనెక్ట్‌ చేసుకున్నాడు. పూలు తెంపడం నుంచి ప్యాకింగ్‌ చేసి మార్కెట్‌కు తీసుకెళ్లే వాహనంలో వేసుకునేంత వరకు పూర్తిగా సీసీ కెమెరాలోనే చూసుకుంటున్నాడు. 

జర్బెరా పూలకు మంచి డిమాండ్‌..
ప్రస్తుతం జర్బెరా పూలకుమార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఎకరానికి ప్రతిరోజూ మూడు నుంచి 4 వేల పూల దిగుబడి రానుంది. ఇక్కడి దిగుబడులను హైదరాబాద్‌లోని గుడిమల్కా పురం మార్కెట్‌కు తీసుకెళ్తారు. స్థానికంగా ఉన్న వ్యాపారులు వచ్చినా అమ్ముతారు. ఒక్క పూవు ఉత్పత్తికి రూ. 1.50 ఖర్చు వస్తుంది. ఇదే పువ్వును విక్రయిస్తే సీజన్‌లో రూ.2.50 నుంచి రూ.3 వరకు ఆదాయం వస్తుంది. సీజన్‌ లేని సమయంలో ఒక్కో పువ్వుకు రూ.2.00 తగ్గకుండా ఆదాయం సమకూరుతుంది. ఏడాదిలో సుమారుగా ఐదారు నెలలపాటు మంచి సీజన్‌ ఉండడంతో ఆ రోజుల్లో మంచి లాభాలు సమకూరనున్నాయి. 

పూల సేద్యం సంతృప్తినిస్తుంది: హర్షారెడ్డి 
ప్రముఖ వైద్యుడిగా అమెరికాలో ఉద్యోగంలో ఉన్నా నాకు అంతగా తృప్తి కలుగలేదు. స్థాని కంగా మరేదో చేయాలన్న తపన నిరంతరం ఉండేది. ఆ సమయంలో తన మిత్రుడు పాలీ హౌజ్‌ నిర్వహణపై సూచన చేయడంతో పూల సాగును ఎంచుకున్నాను. నెలలో 15 రోజులు అక్కడ, మరో 15రోజులు ఇక్కడ ఉంటూ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. సాగులో ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి ఆదాయమే వస్తుం ది. అమెరికాలో ఉన్నా సెల్‌లో పర్య వేక్షిస్తుంటా. ఇక్కడ అనుభవంతో కూడిన సిబ్బంది ఉండడంతో తనకు కొంత రిస్క్‌ తగ్గింది. తన వలన మరో 12 మందికి ఉపాది లభిస్తుండడం తనకు సంతోషానిస్తుంది.

మరిన్ని వార్తలు